న్యూఢిల్లీ: ఒక మహిళ తన మాజీ ప్రియుడికి ఊహించని షాక్ ఇచ్చింది. ప్రేమికుల రోజున ఏకంగా వంద పిజ్జాలు పంపింది. (Woman Sends 100 Pizzas To Ex-Boyfriend) అయితే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్‌తో వాటిని ఆర్డర్ చేసింది. వాలంటైన్స్ డే రోజున మాజీ లవర్‌పై ఈ మేరకు రివేంజ్ తీసుకున్నది. దేశ రాజధాని ఢిల్లీ శివారు ప్రాంతమైన హర్యానాలోని గురుగ్రామ్‌లో ఈ సంఘటన జరిగింది. ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు సందర్భంగా 24 ఏళ్ల ఆయుషి రావత్ తన మాజీ ప్రియుడైన యష్ సంఘ్వీకి ఏకంగా వంద పిజ్జాలు పంపింది. అయితే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్‌తో వీటిని ఆర్డర్ చేసింది.
కాగా, మాజీ ప్రియుడి చిరునామాకు ఆయుషి రావత్ ఆర్డర్ చేసిన వంద పిజ్జాలను డెలివరీ ఎగ్జిక్యూటివ్ అక్కడకు తీసుకెళ్లాడు. ఒక ఇంటి డోర్ ముందు ఉంచిన వంద పిజ్జా బాక్సుల ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు భిన్నంగా స్పందించారు. విడిపోయిన మాజీ లవర్‌పై ప్రతీకారమా? లేక పబ్లిసిటీ స్టంటా? అని చాలా మంది సందేహం వ్యక్తం చేశారు.
మరోవైపు ఆ మహిళ చర్యను కొందరు సమర్థించగా పలువురు విమర్శించారు. వంద పిజ్జాల ఆర్డర్‌ను ఆ వ్యక్తి తీసుకోకపోతే ఆమె ఇబ్బందుల్లో పడుతుందని ఒకరు తెలిపారు. అయితే ఇంత పెద్ద ఆర్డర్ క్యాష్ ఆన్ డెలివరీ వల్ల సాధ్యంకాదని మరొకరు అభిప్రాయపడ్డారు. ఆహారం, వనరుల వృథాగా ఒకరు మండిపడ్డారు. ఇది మార్కెటింగ్ వ్యూహంలాగా కనిపిస్తున్నదని మరొకరు అనుమానం వ్యక్తం చేశారు.