లక్నో: సహజీవనం చేస్తున్న వ్యక్తి వేధింపులను మహిళ భరించలేకపోయింది. ఈ నేపథ్యంలో అతడ్ని తుపాకీతో కాల్చి చంపింది. బుల్లెట్ గాయాలతో మృతదేహం పడి ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దర్యాప్తు చేసిన పోలీసులు ఆ మహిళను అరెస్ట్ చేశారు. (Woman kills live-in partner) ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఏప్రిల్ 29న జులాహాపూర్ గ్రామం సమీపంలోని అటవీ ప్రాంతంలో బుల్లెట్ గాయాలతో పడి ఉన్న వ్యక్తి మృతదేహం గురించి పోలీసులకు సమాచారం అందింది. దీంతో అక్కడకు చేరుకుని పరిశీలించారు. హతుడ్ని అనుజ్ కుమార్‌గా గుర్తించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు.
కాగా, అనుజ్ కుమార్ కుటుంబం ఫిర్యాదుతో అతడి హత్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు కోసం మూడు బృందాలను ఏర్పాటు చేశారు. అతడితో కలిసి సహజీవనం చేస్తున్న శోభా రాణిపై పోలీసులకు అనుమానం కలిగింది. ఆమెను ప్రశ్నించగా పెద్దగా ఏడుస్తూ నిజం ఒప్పుకున్నది.
మరోవైపు 2011లో సత్యేంద్ర అనే వ్యక్తితో శోభా రాణికి పెళ్లి జరిగింది. వారికి ఒక కుమార్తె ఉన్నది. 2023లో తన భర్త నుంచి శోభా విడిపోయింది. 2024లో అనుజ్ కుమార్ ఆమెకు పరిచయమయ్యాడు. దీంతో వారిద్దరూ కలిసి సహజీవనం చేస్తున్నారు.
అయితే అనుజ్ తనను శారీరకంగా, లైంగికంగా వేధించాడని శోభా ఆరోపించింది. వీడియో రికార్డ్ చేసి బెదిరించి లైంగిక చర్యలకు బలవంతం చేశాడని తెలిపింది. డబ్బులు డిమాండ్ చేసేవాడని, నిరాకరించినప్పుడు కొట్టేవాడని చెప్పింది. తన పదేళ్ల కుమార్తె పట్ల అతనికి దురుద్దేశాలు ఉన్నాయని ఆమె ఆరోపించింది. తన చెల్లిని లైంగికంగా వేధించడానికి ప్రయత్నించి గతంలో అరెస్టయ్యాడని పోలీసులకు చెప్పింది.
కాగా, ఏప్రిల్ 28 రాత్రి వేళ అనుజ్ తనను ఒక కేఫ్‌కు తీసుకెళ్లాడని శోభా తెలిపింది. ఆ తర్వాత గ్రామానికి తీసుకువెళ్లి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆమె ఆరోపించింది. మొదట ఆత్మహత్య చేసుకోవాలని తాను భావించినట్లు చెప్పింది. అయితే తన కుమార్తె భద్రత గురించి ఆందోళన చెందినట్లు వివరించింది. ఈ నేపథ్యంలో అనుజ్ వద్ద ఉన్న నాటు తుపాకీని లాక్కుని అతడ్ని కాల్చి చంపినట్లు పోలీసులకు వెల్లడించింది.
మరోవైపు ఇది తెలుసుకున్న పోలీసులు శోభను అరెస్ట్ చేశారు. అనుజ్ హత్యకు వినియోగించిన తుపాకీని ఆమె నుంచి స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్ నిమిత్తం జైలుకు తరలించినట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.