చండీగఢ్: పెళ్లికి రెండు రోజుల ముందు కాబోయే భర్తపై ప్రియుడితో వధువు దాడి చేయించింది. దీంతో తీవ్రంగా గాయపడిన వరుడు కోమాలో ఉన్నాడు. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నాడు. (Woman gets fiance attacked by lover) వరుడి కుటుంబం ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఢిల్లీ శివారు ప్రాంతమైన హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఈ సంఘటన జరిగింది. 28 ఏళ్ల గౌరవ్, ఐటీఐ టీచర్. ఏప్రిల్ 15న నేహాతో అతడికి నిశ్చితార్థం జరిగింది. నాటి నుంచి నేహా ప్రియుడు సౌరవ్ నుంచి బెదిరింపులు వచ్చాయి.
కాగా, పెళ్లికి రెండు రోజుల ముందు గౌరవ్‌పై దాడి జరిగింది. ఏప్రిల్ 17న ఇంటికి తిరిగి వెళ్తున్న అతడిని ఆదర్శ్ నగర్ ప్రాంతంలో అడ్డుకున్నారు. సౌరవ్, అతడి స్నేహితుడు సోను మరికొందరు కలిసి కర్రలు, బేస్‌బాల్ బ్యాట్లతో కొట్టారు. దీంతో గౌరవ్ కాళ్లు, చేతులు, ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. అతడ్ని హాస్పిటల్‌కు తరలించారు. కోమాలో ఉన్న గౌరవ్‌కు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు కాబోయే భార్య నేహా తన ప్రియుడు సౌరవ్‌తో గౌరవ్‌పై దాడి చేయించిందని అతడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. దాడి సందర్భంగా సౌరవ్ ఈ సంగతి చెప్పాడని, నేహా పంపిన ఫొటోను చూపించినట్లు కోమాలోకి వెళ్లే ముందు గౌరవ్ తమతో అన్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎంగేజ్మెంట్ సందర్భంగా నేహా కుటుంబం గౌరవ్‌కు ఇచ్చిన బంగారు ఉంగరం, గొలుసును సౌరవ్ లాక్కున్నాడని, వాటిపై అతడికి ఎలాంటి హక్కు లేదని చెప్పాడని ఆరోపించారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.