ముంబై: వీధి కుక్కలకు ఆహారం పెడుతున్నందుకు ఒక మహిళకు రెసిడెన్సియల్ సొసైటీ రూ.8 లక్షల జరిమానా విధించింది. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ ఘటన జరిగింది. ఎన్ఆర్ఐ హౌసింగ్ కాంప్లెక్స్‌లో 40కు పైగా భవనాలున్నాయి. అందులో నివాసం ఉంటున్న అన్షు సింగ్ ఈ విషయాన్ని మీడియాకు తెలిపారు. మేనేజ్మెంట్ కమిటీ తీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వీధి కుక్కలకు ఆహారం పెట్టేవారిపై రోజుకు రూ.5,000 జరిమానా విధిస్తున్నారని ఆరోపించారు. ఈ ఏడాది జూలై నుంచి దీనిని అమలు చేస్తున్నారని, ఇప్పటి వరకు తనకు రూ.8 లక్షల మేర జరిమానా విధించారని తెలిపారు. మరో నివాసిపై రూ.6 లక్షల పెనాల్టీ ఉన్నదని ఆమె పేర్కొన్నారు. వీధి కుక్కలకు ఆహారం పెట్టే వారిని వాచ్‌మేన్ గమనించి వారి పేర్లను మేనేజ్మెంట్ కమిటీకి అందజేస్తాడని, దీంతో వారికి జరిమానా విధిస్తారంటూ మరో మహిళ లీలా వర్మ తెలిపారు.
కాగా, హౌసింగ్ కాంప్లెక్స్ కార్యదర్శి వినీతా శ్రీనందన్ దీనిపై మీడియాకు వివరణ ఇచ్చారు. అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లో కుక్కలకు ఆహారం పెట్టడం వల్ల పిల్లలు, వృద్ధులు ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. కుక్కల వల్ల పార్కింగ్ ప్రదేశాలు అపరిశుభ్రంగా ఉంటున్నాయని, రాత్రి వేళల్లో అవి మొరుగుతుండటంతో నిద్రపట్టడం లేదని చాలా మంది ఫిర్యాదు చేస్తున్నట్లు చెప్పారు. మరోవైపు కుక్కలకు ఆహారం పెట్టేందుకు ప్రత్యేకంగా ఎన్క్లోజర్ను ఏర్పాటు చేసినప్పటికీ కొంత మంది బహిరంగ ప్రదేశాల్లో ఆహారం పెడుతున్నారని, అందుకే జరిమానా విధించాలని మేనేజ్మెంట్ కమిటీ నిర్ణయించిందని వెల్లడించారు.