శుక్రవారం 05 జూన్ 2020
National - Apr 08, 2020 , 11:39:54

230 కి.మీ. కాలినడక.. అబలను కబళించిన ఆకలి

230 కి.మీ. కాలినడక.. అబలను కబళించిన ఆకలి

హైదరాబాద్‌ : ఓ అబల ఆకలితో అలమటించి కన్నుమూసింది. ఒకట్రెండు కిలోమీటర్లు కాదు.. ఏకంగా 230 కిలోమీటర్లు నడవడంతో నీరసించి పోయి తను పాదం మోపిన భూమాత ఒడిలో ఒదిగిపోయింది. తాగడానికి గుక్కెడు నీళ్లు లేవు.. తినడానికి పిడికెడు మెతుకులు లేవు.. చివరకు ఎర్రటి ఎండ.. కాలినడక ఆమె ప్రాణాల్ని బలి తీసుకున్నాయి. 

కరోనా వైరస్‌ కారణంగా దేశమంతా లాక్‌డౌన్‌ను విధించారు. దీంతో రోజువారి కూలీలకు ఉపాధి దొరకడం కష్టమైంది. రాయచూరు జిల్లా సింధనూరు పట్టణంలోని వెంకటేశ్వరనగర్‌కు చెందిన గంగమ్మ(27) దంపతులు.. బెంగళూరులోని కెంగేరి ఏరియాలో భవన నిర్మాణ రంగంలో కూలీలుగా పని చేస్తున్నారు. లాక్‌డౌన్‌ అమలు చేయడంతో.. భవన నిర్మాణ పనులు ఆగిపోయాయి. దీంతో కూలీలు తమ సొంతూర్లకు వెళ్లాలని కాంట్రాక్టర్‌ ఆదేశించారు. కూలీలకు పూట గడవడం కష్టంగా మారింది.

సింధనూరు పట్టణానికి చెందిన కూలీలు దిక్కుతోచని స్థితిలో మార్చి 30వ తేదీన తమ సొంతూరికి ట్రాక్టర్‌లో బయల్దేరారు. బెంగళూరు నుంచి తుమకూరు రాగానే పోలీసులు ట్రాక్టర్‌ను ఆపేశారు. చేసేదిమీ లేక తుమకూరు నుంచి కూలీలందరూ కాలినడకన బళ్లారికి బయల్దేరారు. తుమకూరు - బళ్లారి మధ్య సుమారు 230 కిలోమీటర్ల దూరం ఉంది. బళ్లారి సమీపం వరకు గంగమ్మతో పాటు మిగతా కూలీలు కాలినడకనే వచ్చారు. తుమకూరు - బళ్లారి మధ్యలో ఆ కూలీలకు ఎవరూ తిండి పెట్టలేదు. కనీసం నీరు కూడా ఇవ్వలేదు. ఎందుకంటే కరోనా భయంతో. చివరకు ఏప్రిల్‌ 2వ తేదీన ఓ ట్రాక్టర్‌ను కిరాయి తీసుకుని బళ్లారికి రాగానే అక్కడున్న చెక్‌పోస్టు వద్ద పోలీసులు వారిని ఆపేశారు. అక్కడున్న ఓ పునరావాస కేంద్రంలో కూలీలు సేద తీరుతున్నారు. 

గంగమ్మ మాత్రం తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆమెకు మూడు రోజుల పాటు నీరు, ఆహారం లేకపోయేసరికి తీవ్రంగా నీరసించింది. దీంతో భర్త సహాయంతో కూలీలు ఆమెను విమ్స్‌ ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చేరిన తర్వాత ఆమెకు ఆహారంతో పాటు పండ్ల రసం కూడా ఇచ్చారు. గంగమ్మకు ఇతర అనారోగ్య సమస్యలు ఉండడంతో చికిత్స పొందుతూనే ఆమె కన్నుమూసింది. నీరసం, కాలేయం, రక్తహీనత వల్లే గంగమ్మ మృతి చెందిందని వైద్యులు తెలిపారు. 


logo