లక్నో: భర్త స్నేహితులు తనను కిడ్నాప్ చేసి సాముహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఒక మహిళ ఆరోపించింది. ప్రైవేట్ భాగంలో సీసా చొప్పించినట్లు ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఆ మహిళ ఆరోపణలు తప్పని దర్యాప్తులో తేలింది. ఈ నేపథ్యంలో ఆమెను అరెస్ట్ చేశారు. (Woman Alleges Gang Rape, Arrested) ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఈ సంఘటన జరిగింది. గత ఏడాది జూన్‌లో కవి నగర్ ప్రాంతంలో నివసించే వికాస్ త్యాగిపై ఒక మహిళ ఫిర్యాదు చేసింది. సహజీవనం చేస్తున్న అతడు తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేశాడని ఆరోపించింది. దీని వల్ల కడుపులోని బిడ్డ చనిపోయినట్లు ఫిర్యాదులో పేర్కొంది.
కాగా, జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఎదుట స్టేట్మెంట్ రికార్డ్ సందర్భంగా ఆ మహిళ మాట మార్చింది. ఏకాభిప్రాయంతో తమ మధ్య సంబంధం ఉందని, త్యాగి తనను కొట్టాడని, కోర్టు బయట తాము ఒప్పందం చేసుకున్నట్లు తెలిపింది. డాక్టర్ సలహా పాటించసోవడం వల్లనే గర్భస్రావం జరిగినట్లు చెప్పింది.
మరోవైపు గత ఏడాది ఆగస్ట్‌లో ఆ మహిళ మళ్లీ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. త్యాగి, బావమరిది, అతడ్ని ఫ్రెండ్ కలిసి చంపుతామని తనను బెదిరించడంతో అలా స్టేట్మెంట్ ఇచ్చినట్లు ఆరోపించింది. అదే నెలలో మళ్లీ పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. త్యాగి తాను పెళ్లి చేసుకున్నట్లు చెప్పింది. అతడిపై చర్యలను నిలిపివేయాలని కోరుతూ దరఖాస్తు చేసింది.
కాగా, ఈ ఏడాది జనవరిలో ఆ మహిళ మళ్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. త్యాగితో పెళ్లి తంతు పూర్తి కాలేదని ఆరోపించింది. త్యాగి తన ఇద్దరు స్నేహితులతో కలిసి తనపై సామూహిక లైంగిక దాడికి పాల్పడినట్లు ఫిర్యాదు చేసింది. త్యాగి తనను కొట్టడంతోపాటు ఒంటిపై మద్యం పోసి నిప్పంటించినట్లు ఆరోపించింది. దీంతో పోలీసులు దర్యాప్తు చేశారు. సామూహిక అత్యాచారం ఆరోపణలు తప్పని తేలింది. ఆమె శరీరంపై కాలిన గాయాలున్నాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 17న త్యాగిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
మరోవైపు తాజాగా ఫిబ్రవరి 25న ఆ మహిళ మరోసారి సంచలన ఆరోపణలు చేసింది. ముందు రోజు రాత్రి వేళ భర్త త్యాగి ముగ్గురు స్నేహితులు తనను కిడ్నాప్ చేశారని, మత్తు ఇంజెక్షన్ ఇచ్చి తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపించింది. ప్రైవేట్ భాగంలో సీసా చొప్పించినట్లు ఫిర్యాదులో పేర్కొంది.
అయితే తాజా ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు చేశారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. ఆ రాత్రి ఆమె కారులో వెళ్లి ఇంటికి తిరిగి వచ్చినట్లు గమనించారు. త్యాగి స్నేహితుల కాల్ డాటా పరిశీలించారు. నేరం జరిగినట్లు ఆ మహిళ ఆరోపించిన ప్రాంతంలో వారు లేరని తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో తప్పుడు ఫిర్యాదు చేసినట్లు గ్రహించిన పోలీసులు శుక్రవారం ఆ మహిళను అరెస్ట్ చేశారు.