భోపాల్: దేశ వ్యాప్తంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను (Single Use Plastic) నిషేధించారు. అయినప్పటికీ వాటి వినియోగం మాత్రం ఆగలేదు. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ వినూత్నంగా ఆలోచించింది. ఒక్కసారి వినియోగించే ప్లాస్టిక్ వల్ల కలిగే చెడు ప్రభావాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కొత్త విధానాన్ని ఎంచుకున్నది. ఆదివారం స్థానిక గ్రౌండ్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు ఫేర్వెల్ పార్టీ ఇచ్చింది. ఒక్కసారి వినియోగించే ప్లాస్టిక్ వస్తువులకు వీడ్కోలు పలికే ఈ కార్యక్రమంలో ఇండోర్ ఎంపీ శంకర్ లాల్వానీ, మంత్రి తులసీరామ్ సిలావత్, పలువురు ప్రజాప్రతినిధులు, నగర ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల కలిగే అనార్ధాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అలాగే స్థానికంగా పాపుల్ అయిన ‘పోహా’ను అందరికీ సర్వ్ చేశారు.
కాగా, ఒక్కసారి మాత్రమే వినియోగించి పడేసే ప్లాస్టిక్ వస్తువులను వాడవద్దంటూ పలు ప్రచార కార్యక్రమాలు చేపట్టినట్లు ఇండోర్ మేయర్ పుష్యమిత్ర భార్గవ తెలిపారు. అయినప్పటికీ వీటి వినియోగం ఇంకా కొనసాగుతున్నదని చెప్పారు. అందుకే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల వాటిల్లే చెడు ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఇలా వినూత్నంగా వీడ్కోలు పార్టీ నిర్వహించినట్లు వెల్లడించారు. వరుసగా ఏడోసారి కూడా దేశంలోనే అత్యంత క్లీన్ సిటీగా ఇండోర్ మరోసారి నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.