గౌహతి: కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్‌కు పాకిస్థాన్‌తో సంబంధాలు ఉన్నాయని పదే పదే ఆరోపిస్తున్న అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ (Himanta Biswa Sarma) ఆదివారం మరోసారి తన వాదనను పునరుద్ఘాటించారు. తాను చెప్పింది ఏదైనా తప్పు అని తేలితే రాజీనామా చేస్తానని అన్నారు. పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) ఆహ్వానం మేరకు గొగోయ్ పాకిస్థాన్ వెళ్లారని, అక్కడ శిక్షణ పొందారని శర్మ ఆరోపించారు. తిరిగి వచ్చిన తర్వాత రాఫెల్ కొనుగోలును ఆయన వ్యతిరేకించారని తెలిపారు. గొగోయ్ భార్యకు పాక్ సైన్యంతో మంచి సంబంధాలున్నాయని ఆరోపించారు. నా ఒక్క మాట కూడా తప్పు అని నిరూపితమైతే ముఖ్యమంత్రి పదవికి నేను రాజీనామా చేస్తా అని ఆయన అన్నారు.
మరోవైపు తనతోపాటు తన భార్యపై సీఎం హిమంత బిస్వా శర్మ పదే పదే చేస్తున్న ఆరోపణలను కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ తోసిపుచ్చారు. ఆయన చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు చూపాలని అన్నారు. ‘అస్సాం ముఖ్యమంత్రి ఆరోగ్యం గురించి నేను ఆందోళన చెందుతున్నా. ఆయన బాగా తెలిసిన వ్యక్తి. నేను అస్సాంలోకి అడుగుపెట్టినప్పటి నుంచి ఏదో ఒక కారణంతో నాపై నిఘా ఉంచారు. గత 13 ఏళ్లలో నా గురించి చాలా నిరాధారమైన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలి వ్యాఖ్యలు పిచ్చితనం, అసంబద్ధతకు దారితీస్తాయి’ అని అన్నారు. ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి హిమంత బిస్వా శర్మ లెక్కలేనన్ని సార్లు అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. 2026 తర్వాత ఆయనకు కొంత విశ్రాంతి లభించేలా చూస్తామని అన్నారు.