Wolf Attack | లక్నో: యూపీకి చెందిన ఓ తల్లి తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా తోడేలుతో పోరాడి తన కుమారుడిని రక్షించుకున్నది. భరూచ్‌లోని హార్డి ప్రాంతంలో ఆదివారం ఐదేండ్ల బాలుడు పరాస్ తన కుటుంబ సభ్యులతో కలిసి నిద్రపోతుండగా ఓ తోడేలు దాడి చేసి ఎత్తుకెళ్లింది. ఇది గమనించిన అతడి తల్లి మరో ఆలోచన లేకుం డా వెంటనే మంచం మీద నుంచి తోడెలుపైకి దూకింది. అత్యంత చాకచక్యంతో దాని మెడను గట్టిగా నొక్కిపెట్టింది.
ఉక్కిరిబిక్కిరి అయిన ఆ తోడేలు పరాస్‌ను వదిలిపెట్టింది. అనంతరం ఆమె గట్టిగా అరిచి, కుటుంబ సభ్యుల సాయం కోరింది. వారంతా వచ్చే సరికి తోడేలు పారిపోయింది. సుమారు 50 రోజుల నుంచి భరూచ్ సహా మరికొన్ని జిల్లాలో తోడేళ్లు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సోమవారం మరో బాలికను తోడేళ్లు పొట్టనబెట్టుకున్నాయి. తోడేళ్లను పట్టుకోవడానికి అటవీ శాఖాధికారులు చిన్న పిల్లల మూత్రంతో తడిసిన రంగు రంగుల టెడ్డీ బేర్లను అవి విశ్రాంతి తీసుకునే నదీ పరీవాహక ప్రాంతాల్లో పెడుతున్నారు. తోడేళ్లు రాత్రి వేళ జనంపై దాడి చేసి, ఉదయానికల్లా తిరిగి తమ విశ్రాంతి ప్రదేశాలకు వెళ్లిపోతున్నాయని డివిజినల్ ఫారెస్ట్ ఆఫీసర్ అజిత్ ప్రతాప్ సింగ్ చెప్పారు.