ముంబై: దేశంలోని మెడికల్ కాలేజీల్లో ప్రవేశం కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) కోసం ప్రిపేర్ అవుతున్న విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరోజన్మలో డాక్టర్ అవుతానని, తల్లిదండ్రుల కోరిక తీర్చుతానని సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. (NEET Aspirant Suicide) మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఖండాలాకు చెందిన 19 ఏళ్ల సూరజ్ సుభాష్ షిండే, నీట్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు. అయితే చదువు, తన భవిష్యత్తుపై తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. తల్లిదండ్రులు బయటకు వెళ్లగా ఇంట్లో ఒంటరిగా ఉన్న సూరజ్ మేడమీద ఉన్న గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చనిపోయే ముందు సూసైడ్ నోట్ రాశాడు. ‘సారీ అమ్మా నాన్న. వచ్చే జన్మలో నేను తప్పకుండా మీ కోసం డాక్టర్ని అవుతా. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. సంతోషంగా ఉండండి’ అని అందులో పేర్కొన్నాడు.
కాగా, ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత తమ కుమారుడు ఉరికి వేలాడటాన్ని చూసి అతడి తల్లిదండ్రులు షాక్ అయ్యారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. సూరజ్ సుభాష్ షిండే మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతడి ఆత్మహత్యపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.
మరోవైపు నీట్ పేపర్ లీక్ నేపథ్యంలో మే నెలలో నిర్వహించిన పరీక్షను ఎన్టీయే రద్దు చేసింది. తిరిగి రీటెస్ట్ నిర్వహించింది. ఈ నేపథ్యంలో పలువురు అభ్యర్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అలాగే నీట్ ఎగ్జామ్‌పై కొందరు విద్యార్థులు ఇంకా ఆందోళన చెందుతున్నారు.