రాయ్పూర్ : భర్త పని చేసే ప్రదేశానికి వెళ్లి.. అసభ్యకరమైన పదజాలంతో దూషించడం క్రూరత్వమే అవుతుందని రాయ్పూర్ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును ఛత్తీస్గఢ్ హైకోర్టు సమర్థించింది. ఈ కేసులో రాయ్పూర్ ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేయడం సమర్థించదగ్గదేనని హైకోర్టు పేర్కొన్నది. ఈ తీర్పును హైకోర్టు ఆగస్టు 18న వెలువరించింది.
కేసు పూర్వపరాలను పరిశీలిస్తే.. ధంతారి జిల్లాకు చెందిన ఓ 32 ఏండ్ల వ్యక్తి.. వితంతువు(34)ను 2010లో వివాహం చేసుకున్నాడు. భర్త వృత్తిరీత్యా ప్రభుత్వ ఉద్యోగి. అయితే కొన్నాళ్లు వీరి సంసార జీవితం బాగానే సాగింది. ఇక 2017 నుంచి భర్తను భార్య అనుమానించడం ప్రారంభించింది. భర్త పని చేస్తున్న ఆఫీసుకు భార్య వెళ్లి సహోద్యోగుల ముందు అసభ్యకర పదజాలంతో దూషించేది. అంతే కాకుండా తన భర్త అక్రమ సంబంధం కలిగి ఉన్నాడని ఆరోపిస్తూ.. ముఖ్యమంత్రికి, ఓ మంత్రికి లేఖ కూడా రాసింది. ఇక భర్త తల్లిదండ్రులను ఆయనకు దూరం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో భర్త రాయ్పూర్ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. ఇరు వర్గాల వాదోపవాదాలు, సాక్ష్యాలను పరిగణించిన తర్వాత కోర్టు 2019లో భర్తకు విడాకులు మంజూరు చేసింది.
భర్తకు రాయ్పూర్ ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేయడాన్ని భార్య ఛత్తీస్గఢ్ హైకోర్టులో సవాల్ చేసింది. భర్త పట్ల భార్య క్రూరంగా ప్రవర్తించిందని రాయ్పూర్ ఫ్యామిలీ కోర్టు మంజూరు చేసిన విడాకులను రద్దు చేయాలని భార్య తరపు లాయర్ హైకోర్టులో వాదించారు. ఇక హైకోర్టు ఇరుపక్షాల వాదనలను విన్న తర్వాత, రాయ్పూర్ ఫ్యామిలీ కోర్టు తీర్పు సమర్థించదగ్గదే అని స్పష్టం చేసింది. భర్తకు అక్రమ సంబంధం ఉందని భార్య నిరూపించలేకపోయిందని కోర్టు పేర్కొన్నది. అంతేకాకుండా భర్త పని చేసే ప్రదేశానికి వెళ్లి అతన్ని సహోద్యోగుల ముందు అసభ్యకర పదజాలంతో దూషించడం, అతని స్థాయిని దిగజార్చేలా ప్రవర్తించడం క్రూరత్వమే అవుతుందని కోర్టు తెలిపింది. తల్లిదండ్రులను కలుసుకోనీయకుండా వేధించడం కూడా తీవ్రమైన నేరమే అవుతుందని, ఈ కేసులో భార్య నుంచి భర్తకు విడాకులు మంజూరు చేసిన రాయ్పూర్ ఫ్యామిలీ కోర్టు తీర్పు సమర్థనీయమేనని హైకోర్టు స్పష్టం చేసింది.