High Court | భోపాల్: భార్య వేరొక వ్యక్తి పట్ల ప్రేమ, ఆప్యాయతలను ప్రదర్శించినపుడు, ఆ ఇద్దరి మధ్య శారీరక సంబంధాలు లేనంత వరకు, ఆమె వివాహేతర సంబంధానికి పాల్పడినట్టు కాదని మధ్యప్రదేశ్ హైకోర్టు చెప్పింది. భార్య వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్టు రుజువైతేనే ఆమెకు మనోవర్తి, పోషణ భత్యాలను నిరాకరించవచ్చునని వివరించింది. వేరుగా ఉంటున్న భార్యకు పోషణ భత్యం చెల్లించాలని ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఆదేశాలపై భర్త చేసిన అప్పీలును హైకోర్టు తోసిపుచ్చింది.
భర్తకు అత్యల్ప ఆదాయం వస్తుండటం భార్యకు పోషణ భత్యాన్ని తిరస్కరించడానికి తగిన కారణం కాదని చెప్పింది. తన రోజువారీ అవసరాలను తీర్చుకోవడానికి తగిన సామర్థ్యం తనకు లేదని సంపూర్ణంగా తెలిసి కూడా ఓ పురుషుడు ఓ యువతిని వివాహం చేసుకుంటే, అందుకు బాధ్యత వహించవలసినది అతడేనంది.