లక్నో: క్రమశిక్షణ నోటీస్కు ఒక కానిస్టేబుల్ వినూత్నంగా రిప్లై ఇచ్చాడు. భార్య తనకు పీడ కలలు రప్పిస్తోందని, నిద్ర పోనివ్వడం లేదని ఆరోపించాడు. (Wife Gives Me Nightmares) దీంతో నిద్ర లేమి వల్ల డ్యూటీకి ఆసల్యమవుతున్నదని పేర్కొన్నాడు. కానిస్టేబుల్ ఇచ్చిన ఈ రిప్లై సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ఈ సంఘటన జరిగింది. ప్రావిన్షియల్ ఆర్మ్డ్ కానిస్టేబులరీ (పీఏసీ) విభాగానికి చెందిన ఒక కానిస్టేబుల్ ప్రవర్తనపై క్రమశిక్షణా నోటీస్ జారీ అయ్యింది. ఫిబ్రవరి 16న ఉదయం బ్రీఫింగ్కు అతడు ఆలస్యంగా వచ్చాడని, దుస్తుల సరిగ్గా ధరించలేదని, తరచుగా యూనిట్ కార్యకలాపాలకు హాజరుకావడం లేదని అందులో ఆరోపించారు. తీవ్రమైన క్రమశిక్షణ ఉల్లంఘనలపై సమాధానం ఇవ్వాలంటూ బెటాలియన్ ఇన్చార్జ్ దల్నాయక్ మధుసూదన్ శర్మ ఆ కానిస్టేబుల్కు ఫిబ్రవరి 17న నోటీస్ జారీ చేశారు.
కాగా, ఈ నోటీస్కు ఆ కానిస్టేబుల్ వినూత్నంగా రిప్లై ఇచ్చాడు. వైవాహిక వివాదం కారణంగా నిద్రలేమితో తాను బాధపడుతున్నట్లు తెలిపాడు. ‘నా భార్య నా ఛాతిపై కూర్చుని నన్ను చంపేందుకు, నా రక్తాన్ని తాగేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా పీడ కలలు వస్తున్నాయి. ఫలితంగా రాత్రి పూట నిద్రపోలేకపోతున్నా. దీనివల్ల అధికారిక బ్రీఫింగ్కు ఆలస్యంగా వస్తున్నా’ అని సమాధానం ఇచ్చాడు. నిరాశ, చిరాకు తొలగడం కోసం మందులు వాడుతున్నట్లు పేర్కొన్నాడు.
మరోవైపు తన తల్లి నరాల రుగ్మతతో బాధపడుతున్నదని, తన బాధను ఇది మరింత పెంచిందని ఆ కానిస్టేబుల్ తెలిపాడు. దీంతో జీవించాలన్న కోరికను కోల్పోయానని, దేవుడి పాదాల చెంతకు చేరాలనుకుంటున్నానని చెప్పాడు. ఆధ్యాత్మిక మోక్షం వైపు తనను నడిపించడం ద్వారా తన బాధను అంతం చేయాలని ఉన్నతాధికారులను ఆ లేఖలో అభ్యర్థించాడు.
కాగా, పీఏసీ కానిస్టేబుల్ ఇచ్చిన ఈ రిప్లై నోట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో బెటాలియన్ అధికారులు దీనిపై సీరియస్గా స్పందించారు. ఇలా సమాధానం ఇవ్వడానికి ఆ కానిస్టేబుల్ ఉద్దేశం, ఈ లేఖ ప్రామాణికత, సోషల్ మీడియాలో వైరల్ కావడంపై దర్యాప్తు చేస్తున్నారు.