న్యూఢిల్లీ, అక్టోబర్ 11: వాట్సాప్ వినియోగాన్ని ప్రాథమిక హక్కుగా పిలవలేమని, పిటిషనర్లు దానికి బదులుగా ఇటీవల భారత్ దేశీయంగా ప్రవేశపెట్టిన మెసేజింగ్ యాప్ అరైట్టెని వినియోగించుకోవచ్చు కదా? అని సుప్రీం కోర్టు పేర్కొంది. దేశవ్యాప్తంగా ఉన్న అనుమానిత సామాజిక మాధ్యమ ఖాతాలను రద్దు చేయడానికి, నిలుపుదల చేయడానికి అవసరమైన నిబంధనలు రూపొందించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు గురువారం కొట్టివేసింది. సామాజిక మాధ్యమ కంపెనీలు పారదర్శకత, సమతుల్యతను కొనసాగించాలని పిటిషనర్లు దాఖలు చేసిన విజ్ఞప్తిని జస్టిస్‌లు విక్రమ్ నాథ్, సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం తిరస్కరించింది.
ఆర్టికల్ 32 ప్రకారం వాట్సాప్‌ను వాడటం ప్రాథమిక హక్కేమీ కాదని స్పష్టం చేసింది. ఈ విషయంలో కావాలనుకుంటే పిటిషనర్లు కింది కోర్టును ఆశ్రయించవచ్చునని సూచించింది. కాగా, ఇటీవల జోహో అనే భారత కంపెనీ ప్రవేశపెట్టిన కొత్త మెసేజింగ్ యాప్ ‘అరైట్టె’ గురించి సుప్రీం కోర్టు ప్రస్తావించింది. సెప్టెంబర్‌లో ఈ యాప్ డౌన్లోడ్లు 100 రెట్లు పెరిగాయి. అక్టోబర్ 3 నాటికి ఈ యాప్‌ను 75 లక్షల మంది డౌన్లోడ్ చేసుకుని వాట్సాప్‌కు ప్రత్యామ్నాయంగా వాడుతున్నారు. తాము కూడా ప్రస్తుతం ఈ యాప్‌నే వినియోగిస్తున్నట్టు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ప్రకటించారు.