West Bengal | మళ్లీ తెరపైకి ప్రత్యేక రాష్ట్రం డిమాండ్.. బెంగాల్ విభజనపై రాజకీయ రగడ
పశ్చిమబెంగాల్ విభజన అంశం ఆ రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపింది. ఉత్తరబెంగాల్ను ఈశాన్య ప్రాంతంతో కలపాలంటూ ఇటీవల బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్ ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేయడం రాజకీయంగా సంచలనం రేపింది.
- నార్త్ బెంగాల్‌ను ఈశాన్య ప్రాంతంతో కలపాలని బీజేపీ డిమాండ్
- తృణమూల్ కాంగ్రెస్ ఆగ్రహం
West Bengal | కోల్‌కతా, జూలై 26: పశ్చిమబెంగాల్ విభజన అంశం ఆ రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపింది. ఉత్తరబెంగాల్ను ఈశాన్య ప్రాంతంతో కలపాలంటూ ఇటీవల బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్ ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేయడం రాజకీయంగా సంచలనం రేపింది. బీజేపీ విజ్ఞప్తిపై తృణమూల్ కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. కేంద్రంలోని బీజేపీ బెంగాల్, బెంగాల్ ప్రజల వ్యతిరేక పార్టీ అని విమర్శించింది. బీజేపీ నేతలు గతంలో కూడా ఉత్తర బెంగాల్‌లోని జిల్లాలను యూటీ, ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ల ద్వారా విభజించడానికి ప్రయత్నం చేశారని ఆరోపిస్తూ, వారి ప్రయత్నాలు సాగనివ్వమని హెచ్చరించింది.
ఎప్పటి నుంచో డిమాండ్
రాష్ట్ర విభజనపై బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి మజుందార్ మాట్లాడుతూ బెంగాల్‌లోని ఉత్తర ప్రాంత జిల్లాలకు, ఈశాన్య రాష్ర్టాలకు ఉన్న పోలికలు గురించి ప్రధాని మోదీని కలిసి వివరించినట్టు చెప్పారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఆయా జిల్లాలను ఈశాన్య రాష్ర్టాల్లో కలపాలని కోరానన్నారు. అదే సమయంలో కూచ్ బెహార్‌ను దక్షిణ బెంగాల్ నుంచి విడదీసి ప్రత్యేక రాష్ట్రం చేయాలని బీజేపీ ఎంపీ నాగేంద్ర రాయ్ డిమాండ్ చేశారు.
కాగా, బెంగాల్ విభజన గురించి బీజేపీ ఇలా డిమాండ్ చేయడం ఇది తొలిసారి కాదు. ఉత్తర బెంగాల్ ప్రాంతం చాలాకాలంగా రాష్ట్ర పాలకుల నిర్లక్ష్యానికి గురవుతున్నదని, దానిని ప్రత్యేక రాష్ట్రం లేదా యూటీ చేయాలని 2021లో అప్పటి కేంద్ర మంత్రి జాన్ బర్లా డిమాండ్ చేశారు. అదే ఏడాది వేసవి వేడిమి దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే విద్యాసంస్థలకు వేసవి సెలవులు ప్రకటించగా, తమకు వాతావరణం చల్లగా ఉందని, సెలవులు అక్కర్లేదని పేర్కొంటూ, అందుకే తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుతున్నట్టు సిలిగురి ఎమ్మెల్యే ఘోష్ కోరారు. అలాగే డార్జిలింగ్ హిల్స్‌ను బెంగాల్ నుంచి విడదీయాలని ఒక ఎమ్మెల్యే, జంగల్ మహల్ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రం చేయాలని మరో ఎంపీ డిమాండ్ చేశారు.
బీజేపీ వ్యూహమేమిటి?
గత కొంతకాలంగా బెంగాల్లో అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ విఫలయత్నాలు చేస్తున్నది. దానిలో భాగంగానే ఉత్తర బెంగాల్ విభజన డిమాండ్‌తో ఆ ప్రాంత ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నది. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ గెల్చుకున్న 12 సీట్లలో ఆరు ఆ ప్రాంతానివి కావడం గమనార్హం. 2019 ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ ఏడు సీట్లను నెగ్గింది. దీంతో బెంగాల్‌లోని మిగిలిన ప్రాంతం కన్నా ఇక్కడ దృష్టి కేంద్రీకరించి ప్రత్యేక రాష్ట్రం డిమాండ్‌ను సజీవంగా ఉంచాలని ఆ పార్టీ భావిస్తున్నది. రాష్ట్ర విభజన తమ లక్ష్యం కాదని, రాష్ట్రం మొత్తం అభివృద్ధినే తాము కోరుంటున్నట్టు ఆ పార్టీ ఎంపీ సమిక్ భట్టాచార్య చెబుతున్నప్పటికీ అంతర్గతంగా ఆ పార్టీ లక్ష్యం వేరే ఉందని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్రంలో పాగా వేసేందుకు పావులు కదుపుతున్నదని, అందులో భాగంగానే ఈ విభజన అంశాన్ని మళ్లీ తెరపైకి తెచ్చిందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
ఇది దేశాన్ని విభజించడం వంటిదే
పశ్చిమ బెంగాల్‌ను విభజించేందుకు కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు కుట్ర పన్నుతున్నారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. బెంగాల్‌ను విభజించడం అంటే దేశాన్ని విభజించడం వంటిదేనని అన్నారు. దీనిని తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించమని తేల్చిచెప్పారు. ఢిల్లీలో శనివారం జరుగనున్న నీతి ఆయోగ్ సమావేశానికి హాజరవుతానని ఆమె తెలిపారు. పలు ప్రతిపక్ష పార్టీల ముఖ్యమంత్రులు ఇప్పటికే నీతి ఆయోగ్ భేటీని బహిష్కరించాలని నిర్ణయించగా మమతా బెనర్జీ మాత్రం తాను హాజరై తమ రాష్ట్రం తరఫున నిరసనను తెలియజేస్తానని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

