Supreme Court | న్యూఢిల్లీ: విద్యార్థుల ఆత్మహత్యలు కోటాలోనే ఎక్కువగా ఎందుకు జరుగుతున్నాయని సుప్రీంకోర్టు శుక్రవారం రాజస్థాన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇది పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నదని వ్యాఖ్యానించింది. ఈ సంవత్సరంలో ఇప్పటివరకు కోటాలో 14 ఆత్మహత్యలు జరగడంపై ఆందోళన వ్యక్తం చేసింది.
‘ఒక రాష్ట్రంగా మీరేం చేస్తున్నారు? పిల్లలు కేవలం కోటాలోనే ఎందుకు ఆత్మహత్య చేసుకొంటున్నారు? ఒక ప్రభుత్వంగా మీరు దీని గురించి ఆలోచించలేదా?’ అని జస్టిస్ పార్థీవాలా ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించారు. ఓ ఐఐటీ-ఖరగ్పూర్ విద్యార్థి ఆత్మహత్య, కోటాలో ఇటీవల ఆత్మహత్య చేసుకొన్న నీట్ విద్యార్థిని ఆత్మహత్య కేసుల విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.