భోపాల్: కొందరు వ్యక్తులు పగలు రోడ్లపై అడుక్కుంటున్నారు. రాత్రి వేళ హోటల్స్‌లో బస చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు 22 మందిని వారి రాష్ట్రానికి తిరిగి పంపారు. అలాగే అడుక్కునే వారికి (beggers) వసతి కల్పించ వద్దని హోటల్స్ నిర్వాహకులను హెచ్చరించారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఈ సంఘటన జరిగింది. రాజస్థాన్‌కు చెందిన 22 మంది ఇండోర్ నగరంలో అడుక్కుంటున్నారు. వారిలో 11 మంది పిల్లలు కూడా ఉన్నారు. వీరంతా హోటల్స్‌లో ఉంటున్నారు. రోజంతా నగరంలో పలు ప్రదేశాలలో భిక్షాటన చేస్తున్నారు. రాత్రికి హోటల్స్‌కు తిరిగి వెళ్తున్నారు.
కాగా, ఇండోర్‌లో అడుక్కుంటున్న ఈ బృందాన్ని మహిళా శిశు అభివృద్ధి శాఖ అధికారులు గుర్తించారు. వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. వారి రాష్ట్రమైన రాజస్థాన్‌కు తిరిగి పంపారు. అలాగే భిక్షాటన చేసే వారికి వసతి కల్పించ వద్దని అన్ని హోటళ్లు, లాడ్జీలు, షెల్టర్ల నిర్వాహకులకు సూచించారు. అలా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మరోవైపు దేశంలోని పది నగరాలను యాచకుల రహితంగా మార్చేందుకు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ పది నగరాల్లో ఇండోర్ కూడా ఒకటి. ఈ నేపథ్యంలో ఇండోర్‌లో భిక్షాటనను అధికారులు నిషేధించారు. యాచకులను ఆ నగరం నుంచి పంపేస్తున్నారు.