న్యూఢిల్లీ: రెడ్ లైట్ జంపింగ్ కంటే డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ వాడకం వల్లే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయి. (Phone Use While Driving) తమిళనాడు, లడఖ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, కర్ణాటకలో రోడ్డు ప్రమాద మరణాలు ఎక్కువగా నమోదయ్యాయి. ఐఐటీ ఢిల్లీలోని ట్రాన్స్పోర్టేషన్ రీసెర్చ్ అండ్ ఇంజురీ ప్రివెన్షన్ సెంటర్ ఒక స్టడీ నిర్వహించింది. రోడ్డు ప్రమాదాలు, మరణాలపై ప్రభుత్వ డేటాను విశ్లేషించింది. మంగళవారం జరిగిన గాయాల నివారణ, రోడ్డు భద్రతపై గ్లోబల్ కాన్ఫరెన్స్ ‘సేఫ్టీ 2024’లో ఈ అధ్యయన ఫలితాలను విడుదల చేశారు. 2021లో 56,000 రోడ్డు ప్రమాద మరణాలు సంభవించగా 2022లో ఈ సంఖ్య 61,038కు పెరిగినట్లు పేర్కొన్నారు.
కాగా, 2022లో వేగం కారణంగా 45,928 మరణాలు నమోదయ్యాయి. రాంగ్ సైడ్ డ్రైవింగ్ కారణంగా 3,544 మంది చనిపోయారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల 1,503 మరణాలు, మొబైల్ ఫోన్ వాడుతూ డ్రైవింగ్ వల్ల 1,132 మరణాలు, రెడ్ లైట్ జంపింగ్ వల్ల 271 మరణాలు, ఇతర కారణాల వల్ల 8,660 మరణాలు సంభవించాయి.
మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలకు అతివేగమే ప్రధాన కారణం. అయితే మొబైల్ ఫోన్ వాడుతూ డ్రైవింగ్ చేయడం, రాంగ్ సైడ్ డ్రైవింగ్ వంటి ప్రమాదకర ప్రవర్తనల కారణంగా మరణాలు 21 శాతం పెరిగినట్లు ఈ అధ్యయనంలో గుర్తించారు. మొబైల్ ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వల్ల 2021లో 1,040 మంది మరణించగా 2022లో ఈ సంఖ్య 1,132కు పెరిగింది. అలాగే రెడ్ లైట్ జంప్ కారణంగా నమోదైన మరణాలు 2021లో 222 నుంచి 2022లో 271కు పెరిగాయి.
కాగా, దేశంలోని మొత్తం రహదారుల్లో 2.1 శాతం మాత్రమే ఉన్న జాతీయ రహదారులు అత్యధికంగా రోడ్డు ప్రమాదాలకు కారణమని అధ్యయనం ఎత్తిచూపింది. 2022లో ప్రతి 100 కిలోమీటర్లకు 45 మరణాలు సంభించాయి. అదే సందర్భంలో రాష్ట్ర రహదారుల్లో ప్రతి 100 కిలోమీటర్లకు 23 మరణాలు నమోదయ్యాయి.
మరోవైపు తమిళనాడు, లడఖ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, కర్ణాటకలో రోడ్డు ప్రమాద మరణాలు ఎక్కువగా ఉన్నట్లు ఈ స్టడీలో తేలింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రూపొందించిన జాతీయ వ్యూహ పత్రం ద్వారా ఇది వెల్లడైంది. రోడ్డు ప్రమాదాల మరణాలను తగ్గించడానికి ఈ ప్రాంతాల్లో తగిన చర్యలు చేపట్టాలని ఈ అధ్యయనంలో సూచించారు.