న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) పేరుతో భారత్ చేపట్టిన సైనిక దాడులు, అనంతరం పరిణామాల గురించి త్రివిధ దళాధికారులు మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా పాకిస్థాన్‌లోని కిరానా హిల్స్ (Pakistan’s Kirana Hills) గురించి ప్రస్తావన వచ్చింది. ఆ దేశ పంజాబ్ ప్రావిన్స్‌లోని సర్గోడా జిల్లాలో కిరానా కొండలున్నాయి. పాకిస్థాన్ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఒక రిజర్వ్ ప్రాంతంగా ఇవి ప్రసిద్ధి చెందాయి. ఈ పర్వతాల కింద నిర్మించిన బలమైన కాంక్రీట్ గుహల్లో అణ్వాయుధాలను పాకిస్థాన్ నిల్వ చేసినట్లు సమాచారం.
కాగా, సరిహద్దులో పాక్ దాడులను తిప్పికొట్టే క్రమంలో ఆ దేశంలోని కీలకమైన సైనిక స్థావరాలపై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ దాడులు చేసింది. 8 ఎయిర్ బేస్‌లను ధ్వంసం చేసింది. భారత్ దాడుల్లో సర్గోడాలోని ముషఫ్ ఎయిర్‌బేస్ రన్‌వే ధ్వంసమైనట్లు శాటిలైట్ చిత్రాల ద్వారా నిర్ధారణ అయ్యింది. కిరానా హిల్స్ కింద ఉన్న భూగర్భ అణు నిల్వలకు ఈ రన్ వే అనుసంధానంగా ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ అణు కేంద్రం సమీపంలో భారత్ దాడి చేసినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి.
మరోవైపు సోమవారం త్రివిధ దళాధికారుల మీడియా సమావేశం సందర్భంగా ఒక జర్నలిస్ట్ ఈ ప్రశ్నను లేవనెత్తారు. కిరానా హిల్స్‌లోని పాకిస్థాన్ అణు కేంద్రంపై భారత్ దాడి చేసిందా? అని అడిగారు. ఎయిర్ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ ఎయిర్ మార్షల్ కేకే భారతి ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ‘కిరానా హిల్స్‌లో అణు కేంద్రం ఉన్నదని మాకు చెప్పినందుకు ధన్యవాదాలు. దాని గురించి మాకు తెలియదు. అక్కడ ఏమి ఉన్నప్పటికీ కిరానా హిల్స్‌పై మేం దాడి చేయలేదు’ అని అన్నారు.