Udayan Guha : కోల్‌కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో వైద్యురాలి హత్యాచార ఘటనకు సంబంధించి బెంగాల్ సీఎం మమతా బెనర్జీని విమర్శించే వారిని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వారి వేళ్లు విరిచేస్తుందని మంత్రి ఉదయన్ గుహ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. ఈ ఘటనపై కోల్‌కతాలో జరుగుతున్న నిరసనలను ఆయన షేక్ హసీనా నిష్క్రమణ నేపధ్యంలో బంగ్లాదేశ్‌లో రేగిన అలజడులతో పోల్చారు.
కోల్‌కతా ఘటన విషయంలో దీదీ వైపు వేలెత్తి చూపే వారిని ఉపేక్షించబోమని, ఆమెను సోషల్ మీడియా వేదికగా నిందిస్తూ దీదీ రాజీనామాను డిమాండ్ చేసే వారి భరతం పడతామని మంత్రి హెచ్చరించారు. వీరంతా బెంగాల్‌ను బంగ్లాదేశ్‌లా మార్చాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. గుహ ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వారిని గుర్తించి వారి వేళ్లు విరిచేస్తామని హెచ్చరించారు.
ఆర్జీ కార్ ఆస్పత్రిపై కొందరు వ్యక్తులు దాడి చేసి విధ్వంసం సృష్టించినా పోలీసులు ఏ ఒక్కరిపై కాల్పులు జరపలేదని అన్నారు. పోలీసులు ఇక్కడ బంగ్లాదేశ్ పరిస్ధితిని అనుమతించబోరని స్పష్టం చేశారు. బంగ్లాదేశ్‌లో ఎలాంటి పరిస్ధితికి దారితీసిందో అలాంటి వాతావరణాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ నెలకొనేందుకు అనుమతించదని తేల్చిచెప్పారు. స్ధానికుల సహకారం తీసుకుని బెంగాల్‌ను బంగ్లాదేశ్‌లో మారేందుకు తాము అనుమతించే ప్రసక్తే లేదని మంత్రి పేర్కొన్నారు.
Read More :
Raksha Bandhan | రాఖీపండుగ సందర్భంగా చెట్టుకు రాఖీ కట్టిన బీహార్ సీఎం.. Video