కోల్‌కతా: కరోనా నేపథ్యంలో ముఖానికి మాస్కులు ధరించడం ఇప్పుడు కామన్‌గా మారింది. మరోవైపు కొందరు తమ రిచ్ నెస్, దర్పాన్ని చాటుకునేందుకు బంగారం, వజ్రాలతో కూడిన మాస్కులు కూడా ధరిస్తున్నారు. ఇందులో భాగంగా పశ్చిమ బెంగాల్ దక్షిణ 24 పరగణాల జిల్లాకు చెందిన ఒక వ్యాపారి ఇటీవల రూ.5.7 లక్షల వ్యయంతో ఒక బంగారు మాస్క్‌ను కొనుగోలు చేశారు. బడ్జ్ బడ్జ్ పట్టణంలోని ఆభరణాల తయారీదారుడు, కస్టమైజ్డ్ డిజైనర్ వస్తువులను తయారు చేసే చందన్ దాస్ దీనిని రూపొందించారు.
కాగా, దసరా సందర్భంగా దుర్గా పూజలో పాల్గొన్న ఆ వ్యాపారి ఈ గోల్డెన్ మాస్క్‌ను ధరించారు. అయితే, చుట్టుపక్కల వారు చాలా ఆసక్తిగా గమనించడంతోపాటు దానిపై ఉత్సుకత చూపడంతో ఆయన దానిని తీసివేశారు.
మరోవైపు జర్నలిస్ట్ రితుపర్ణ ఛటర్జీ, ఈ బంగారు మాస్క్ ఫొటోలను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘దీని ఉద్దేశం ఏమిటి?’ అని ఆమె ప్రశ్నించారు.
నెటిజన్లు కూడా దీనిపై మండిపడ్డారు. కరోనా వల్ల చాలా మంది మరణించినా పట్టని కొందరు ఎలాంటి సిగ్గులేకుండా తమ సంపదను, డాబును ఇలా ప్రదర్శిస్తున్నారని ఒకరు విమర్శించారు. సాధారణ మాస్క్‌పై దీనిని ధరిస్తారా అని మరొకరు ప్రశ్నించారు.