కోల్‌కతా, జూన్ 17: రాజ్‌భవన్ నుంచి వెంటనే వెళ్లిపోవాలని అక్కడ విధులు నిర్వరిస్తున్న ఆఫీస్ ఇన్ ఛార్జి సహా పోలీసులందరినీ పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ సోమవారం ఆదేశించారు. రాజ్‌భవన్ తూర్పు ద్వారం వద్ద ఉన్న పోలీస్ అవుట్ పోస్ట్‌ను గవర్నర్ ‘జన్ మంచ్ (ప్రజా వేదిక)’గా మార్చాలనుకొంటున్నారని రాజ్‌భవన్ అధికారి ఒకరు పేర్కొన్నారు. గవర్నర్‌ను కలవడానికి వచ్చిన బీజేపీ నేత సువేందు అధికారి, లోక్‌సభ ఎన్నికల అనంతరం జరిగిన హింస బాధితులుగా చెప్తున్న కొందరిని రాజ్‌భవన్‌లోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్న తర్వాత ఈ పరిణామం చోటు చేసుకొంది.
గవర్నర్‌ను కలవడానికి తనకు లిఖితపూర్వక అనుమతి ఉన్నా పోలీసులు తనను లోపలికి వెళ్లకుండా అడ్డుకొన్నారని సువేందు అధికారి తెలిపారు. దీనిపై ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీఎం మమతకూ ఈ విషయమై లేఖ రాశారు. అయితే రాజ్‌భవన్ బయట 144 సెక్షన్ అమల్లో ఉండటం వల్లే సువేందును అడ్డుకొన్నామని పోలీసులు చెప్పారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ గవర్నర్ బోస్ ‘హౌస్ అరెస్ట్’లో ఉన్నారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.