హైదరాబాద్: అధిక పని ఒత్తిడితో ‘ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా’ కంపెనీలో పనిచేస్తున్న చార్టెడ్ అకౌంటెంట్ (26) అన్నా సెబాస్టియన్ పెరియాలి మృతి వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తన ఎక్స్ అకౌంట్లో స్పందించారు. చాలా విషపూరితమైన, నిస్సారమైన పని విధానం వల్ల.. మరో యువ జీవితాన్ని కోల్పోవాల్సి వచ్చిందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. పుణెలో అన్నా సెబాస్టియన్ మృతి .. పనిప్రదేశాల్లో ఉండే వత్తిడిని గుర్తు చేస్తోందన్నారు. తీవ్ర వత్తిడిలో డెడ్లైన్ల కోసం పనిచేయడం సరికాదు అని, గౌరవంతో పనిచేయాలని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఉద్యోగులకు నాణ్యమైన జీవితాన్ని ఇవ్వాలంటే.. ప్రస్తుతం చట్టపరమైన సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. దీనితో పాటు అధిక పనిని గొప్పగా చిత్రీకరించే విధానాన్ని నిర్మూలించాలన్నారు. మీ జీవితాలే ముఖ్యమన్న విషయాన్ని కార్పొరేట్ ప్రపంచంలోని యువ మిత్రులు గ్రహించాలని కేటీఆర్ తన ట్వీట్లో కోరారు. సంస్మరణ ప్రకటనల కన్నా వేగంగా ఉద్యోగ ప్రకటనలు రిలీజ్ అవుతుంటాయని, కానీ మీ అంతిమ సంస్కారాలకు హాజరయ్యే సమయం మీ బాస్‌లకు ఉండదని కేటీఆర్ పేర్కొన్నారు. మీరు బాధలో ఉన్న సమయంలో.. మీ కుటుంబమే మీతో ఉంటుందని తెలిపారు.
Another young life lost to the grinding wheels of toxic and draining work culture. Anna Sebastian Perayil’s tragic death in Pune is a grim reminder that workplace pressure isn’t just about deadlines, it’s about dignity
The need of the hour is legislative reforms that not only…
— KTR (@KTRBRS) September 20, 2024
ఇది మరిచిపోకండి, జీవితం చాలా చిన్నదని, దాన్ని మీరు మరింత షార్ట్ చేసుకోవద్దు అని కేటీఆర్ తన ట్వీట్లో యువతను కోరారు. కష్ట సమయాల్లో స్ట్రాంగ్‌గా ఉండాలన్న సందేశాన్ని ఆయన ఇచ్చారు. కొన్ని రోజుల క్రితం ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా కంపెనీలో పనిచేస్తున్న చార్టెడ్ అకౌంటెంట్ (26) అన్నా సెబాస్టియన్ పెరియాలి మృతిచెందారు. ఆమె మరణం సర్వత్రా చర్చనీయాంశమైంది.
సెబాస్టియన్ మృతిపై వచ్చిన ఆరోపణల్లో నిజానిజాల్ని తేల్చేందుకు విచారణ చేపట్టబోతున్నామని కేంద్ర కార్మిక శాఖ గురువారం ‘ఎక్స్’ వేదికగా ప్రకటించింది. సెబాస్టియన్ తల్లి అనిత చేసిన ఫిర్యాదును స్వీకరిస్తున్నట్టు కేంద్ర సహాయ మంత్రి శోభా కరంద్లాజే ‘ఎక్స్’లో వెల్లడించారు.
దేశంలో ఎంతోమంది యువతీ యువకులు కలలుగంటున్న ‘సీఏ’ను సెబాస్టియన్ డిస్టింక్షన్లో పాసయ్యారు. పుణేలోని ‘ఈవై గ్లోబల్’ కంపెనీలో ఈ ఏడాది మార్చి 18న చేరారు. ఛాతిలో నొప్పితో జూలై 20న హఠాత్తుగా ఆమె చనిపోయారు. కంపెనీలో నాలుగు నెలలు రాత్రిపగలు తన కూతురుపై పని భారం మోపారని, సరిగా నిద్ర పోనివ్వకుండా అధిక పని ఒత్తిడి వల్లే ఆమె మరణించిందని తల్లి అనిత ఆరోపిస్తున్నారు.