ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తాను కుటుంబంగా కలిసే ఉన్నామని ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ (Sharad Pawar) తెలిపారు. అయితే ఆయన వేరే రాజకీయ పార్టీకి సారధ్యం వహిస్తున్నారని అన్నారు. కొంకణ్ తీర ప్రాంతంలోని చిప్లున్‌లో జరిగిన మీడియా సమావేశంలో శరద్ పవార్ మాట్లాడారు. ఎన్సీపీని చీల్చి షిండే ప్రభుత్వంలో చేరిన అజిత్ పవార్, శరద్ పవార్ తిరిగి కలవాలని వస్తున్న డిమాండ్లపై మీడియా ప్రశ్నించింది. దీనికి సమాధానంగా కనీసం ఇంట్లో అయినా మేం కలిసే ఉన్నామని శరద్ పవార్ తెలిపారు.
కాగా, లోక్‌సభ ఎన్నికల్లో సోదరి సుప్రియా సూలేపై భార్య సునేత్ర పవార్‌ను పోటీకి దించడం పొరపాటు నిర్ణయమన్న అజిత్ పవార్ వ్యాఖ్యలపై మీడియా అడిగిన ప్రశ్నకు శరద్ పవార్ బదులిచ్చారు. ‘ఆయన వేరే పార్టీలో ఉన్నారు. వేరే పార్టీ తీసుకున్న నిర్ణయాలపై మనం ఎందుకు వ్యాఖ్యానించాలి?’ అని అన్నారు.
ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) కూటమి సీఎం అభ్యర్థిని నిర్ణయించిందా? అన్న ప్రశ్నకు ప్రస్తుతం ఇది అత్యవసర సమస్యగా తాను భావించడం లేదని శరద్ పవార్ తెలిపారు. ఎమర్జెన్సీ తర్వాత ఎన్నికలు జరిగినప్పుడు, ప్రధాని అభ్యర్థిగా మొరార్జీ దేశాయ్ పేరును ముందుగా వెల్లడించలేదని ఆయన గుర్తు చేశారు.
మరోవైపు సమాజ్‌వాదీ పార్టీ, రైతులు, కార్మికుల పార్టీ వంటి ఇతర పార్టీల సహాయంతో మహారాష్ట్రలో ప్రత్యామ్నాయ ప్రగతిశీల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే ఎంవీఏ కూటమి ప్రయత్నమని శరద్ పవార్ తెలిపారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎంవీఏ కూటమికి అవకాశం ఇవ్వాలన్నది మహారాష్ట్ర ప్రజల మనసులో ఉన్నట్లుగా తమ పరిశీలినలో తేలిందన్నారు.