Wayanad | తిరువనంతపురం, ఆగస్టు 3: వయనాడ్ జిల్లాలో జరిగిన కొండ చరియల విషాదంలో శనివారం నాటికి మృతుల సంఖ్య 357కు చేరుకుంది. ఇంకా 206 మంది ఆచూకీ తెలియటం లేదని కేరళ సీఎం పినరయ్ విజయన్ శనివారం మీడియాకు తెలిపారు. శోధన, సహాయక ఆపరేషన్ తుది దశకు చేరుకుందని చెప్పారు. ‘చెలియార్ నదిలో లభ్యమైన మృతదేహాలు, శరీర భాగాల్ని గుర్తించటం కష్టంగా మారింది. జిల్లాలో ఇప్పటివరకు 215 మృతదేహాల్ని వెలికితీశారు. ఇందులో 87 మంది మహిళలు, 98 మంది పురుషులు ఉన్నారు. 30 మంది చిన్నారులుగా గుర్తించారు.’ అని విజయన్ తెలిపారు. ఇదిలా ఉండగా, వయానాడ్‌లో తీవ్రంగా నష్టపోయిన బాధితుల కోసం 100 ఇండ్లు నిర్మించి ఇస్తామని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది.
ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందజేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ముందుకు వస్తున్నారని సీఎం విజయన్ అన్నారు. ఓ ఉన్నతాధికారి నేతృత్వంలో ‘హెల్ప్ ఫర్ వయానాడ్ సెల్’ను ప్రారంభించినట్టు చెప్పారు. దాతలు helpforwayanad @kerala.gov.in, 9188940013, 9188940014, 9188940015 ఫోన్ నెంబర్ల ద్వారా సంబంధిత అధికారులను సంప్రదించి, విరాళాలు అందజేయవచ్చునని, బాధితుల పునరావాస ప్రక్రియలో పాల్గొనవచ్చునని విజయన్ చెప్పారు.
వయనాడ్ బాధితుల పునరావాసం కోసం నటుడు మోహన్‌లాల్ విశ్వ శాంతి ట్రస్ట్ తరపున రూ.3 కోట్లు విరాళం అందజేశారు. తీవ్రంగా ప్రభావితమైన చూరల్మాల, ముండకై గ్రామాలను టెరిటోరియల్ ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఆయన శనివారం సందర్శించారు.
వయనాడ్‌కు వచ్చిన కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీకి స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఆయన తన వాహనంలో నుంచి బయటకు దిగకపోవటంతో కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బయట బురద ఉందని, కారులో నుంచి కిందకు దిగకూడదని రాహుల్ గాంధీ అనుకుంటున్నారా? బురద అంటుతుందని భావిస్తే..ఇక్కడికి ఎందుకు వచ్చాడు’ అంటూ ఓ బాధితుడు అరుస్తున్న దృశ్యానికి సంబంధించి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రాహుల్‌గాంధీ వయనాడ్ పర్యటన వల్ల సహాయ కార్యక్రమాలకు ఆటంకాలు ఏర్పడ్డాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్న మరో వీడియో కూడా సోషల్ మీడియాలో విడుదలైంది.
కల్పేట ఫారెస్ట్ ఆఫీసర్ కే హాషిస్ నేతృత్వంలోని రెస్క్యూ బృందం తమ ప్రాణాలకు తెగించి ఓ గిరిజన కుటుంబాన్ని రక్షించింది. అటవీ ప్రాంతంలో ఉన్న లోయకు ఎదురుగా ఉన్న కొండపై ఓ గిరిజన కుటుంబం చిక్కుకోగా, నాలుగున్నర గంటలపాటు శ్రమించి తాళ్ల సహాయంతో రెస్క్యూ బృందం కొండపైకి చేరుకొని గిరిజన కుటుంబాన్ని కాపాడింది.
కొండచరియలు విరిగిపడినపుడు శిథిలాల కింద చిక్కుకున్నవారిని రోదసి పరిజ్ఞానంతో గుర్తించడం సాధ్యం కాదని ఇస్రో చీఫ్ సోమనాథ్ శనివారం చెప్పారు. ఓ కార్యక్రమంలో ఆయన ఓ ప్రశ్నకు ఈ సమాధానం ఇచ్చారు.
వయనాడ్ విపత్తులో ప్రాణాలు కాపాడుకునేందుకు ఒక రోజంతా ఓ కుటుంబం చేసిన యుద్ధం వెలుగులోకి వచ్చింది. చూరల్‌మలలోని అంజిశచలయిల్ ప్రాంతానికి చెందిన సుజాత కుటుంబం ఒకే రోజు రెండు భయంకర అనుభవాలను ఎదుర్కొన్నది. కొండ చరియలు విరిగిపడటంతో ఈ కుటుంబం దగ్గరలో ఉన్న ఓ కొండపైకి చేరుకుని ఒక చిన్న గుహ లాంటి ప్రదేశంలో తలదాచుకున్నది. అయితే, వీరి పక్కనే ఒక అడవి ఏనుగుల మంద కూడా ఉన్నది. తమను ఏమీ చేయవద్దని ఏనుగులను ప్రార్థించామని, అవి తమ జోలికి రాలేదని సుజాత చెప్పారు. మరునాడు ఉదయం సహాయ సిబ్బంది వీరిని రక్షించారు. ప్రస్తుతం సుజాతతో పాటు ఆమె మనవరాలు మృదుల సురక్షితంగా ఉండగా, మిగతా కుటుంబసభ్యులు గాయాలతో చికిత్స పొందుతున్నారు.