తాగు, సాగు నీటికి కటకట.. గుక్కెడు నీటికోసం కిలోమీటర్ల ప్రయాణం
మోదీ స్వరాష్ట్రం గుజరాత్ సహా మహారాష్ట్ర, రాజస్థాన్, ఢిల్లీ, మధ్యప్రదేశ్‌లో నీటి కష్టాలు
న్యూఢిల్లీ, జూన్ 24: తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘మిషన్ భగీరథ’ పథకాన్ని కాపీ కొట్టి ‘హర్‌ఘర్ జల్ యోజన’ పేరిట మేకప్ ఇచ్చుకున్న ప్రధాని మోదీ, ఆయన అనుచరగణం దాన్నీ సక్రమంగా అమలుచేయడం లేదు. అందుకే ప్రధాని స్వరాష్ట్రం గుజరాత్ సహా పలు రాష్ర్టాలు నీటి కటకటతో అల్లాడుతున్నాయి. ఢిల్లీ, రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ తదితర రాష్ర్టాలను నీటి కష్టాలు చుట్టుముట్టాయి. గుక్కెడు నీటి కోసం జనాలు తల్లడిల్లుతున్నారు. బిందెడు నీటి కోసం కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తున్నారు.
వాటి పరిస్థితేంటి?
గుజరాత్‌లోని వడ్గావ్ నియోజకవర్గంలోని ప్రజలు నీటి ఎద్దడితో అల్లాడిపోతున్నారు. తమ సమస్యను తీర్చాలని దశాబ్దాలుగా ప్రభుత్వానికి మొరపెట్టుకొంటూనే ఉన్నారు. ఇటీవలే 50 వేల మంది మహిళలు గత ఆదివారం ప్రధాని మోదీకి పోస్టుకార్డులు రాశారు. సాగుకు నీళ్లివ్వాలంటూ బనాస్కాంఠా, పఠాన్ జిల్లాల్లోని వందలాది రైతులు నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారు. ఆందోళనలు ఉద్ధృతమవ్వడంతో సీఎం భూపేంద్ర పటేల్ దిగొచ్చారు. నీటి కరువు ఎక్కువగా ఉన్న 135 గ్రామాల్లోని చెరువులను నర్మదా నదీ జలాలతో నింపడానికి రూ. 1,566 కోట్లు నిధులు విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.
దొరికే ఆ కొంచం ఉప్పునీరే అమృతం
అక్కడి 70 గ్రామాల్లో ఏ ఒక్క పల్లెలో అడుగుపెట్టినా ఎడారిలో ఉన్నట్లే ఉంటుంది. తాగడానికి చుక్కనీరు దొరకదు. 900 అడుగుల లోతులో బోర్లు వేసినా నీటి జాడ కనిపించదు. దీంతో సాగు ఎప్పుడో పడకేసింది. 15 రోజులైనా నల్లా నీరు రాదు. కాంగ్రెస్‌పాలిత రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జిల్లా భోపాల్‌గఢ్ బ్లాక్‌లో ప్రస్తుత పరిస్థితి ఇది. అందుకే ఈ ప్రాంతాన్ని డార్క్ జోన్‌గా ప్రకటించి సర్కారు చేతులు దులుపుకుందే తప్పా.. ప్రజల నీటి కష్టాలను తీర్చే పాపానపోలేదు. అందుకే భోపాల్గఢ్లో కిలోమీటర్ దూరంలో అప్పటికే కలుషితమై ఉన్న చెరువు నీటిని, బోర్ల నుంచి ఎప్పుడో ఒకప్పుడు వచ్చే కొంచం ఉప్పునీటినే గ్రామస్థులు అమృతంలాగా తాగుతున్నారు. దీంతో వ్యాధులబారిన పడుతున్నారు.
ట్యాంక్ కనబడిందో ఎగబడటమే..
ఢిల్లీని కూడా నీటి కష్టాలు వీడట్లేదు. ఢిల్లీ జల్ బోర్డ్ పంపించిన ట్యాంకర్ వీధుల్లోకి రాగానే ప్రజలు నీటికోసం పోరాటమే చేయాల్సి వస్తున్నది. ఎగువన ఉన్న హర్యానా ప్రభుత్వం యమున నదిని విడుదల చేయకపోవడంతోనే ఈ సమస్య ఉత్పన్నమవుతున్నట్టు ప్రభుత్వం చెబుతున్నది. విమర్శలు వెల్లువెత్తుతుండటంతో పల్లా వద్ద 26 ఎకరాల విస్తీర్ణంలో చెరువు నిర్మాణానికి సిద్ధమైంది.
ముంబైలో నీటి సరఫరాలో కోత
‘ఈ సీజన్లో తగినంత వర్షపాతం ఉండకపోవచ్చు. ప్రజలందరూ నీటిని బంగారంలా వాడుకోవాలి’ నవీ ముంబైలో సీఐడీసీవో అధికారులు స్థానికులకు చేసిన విజ్ఞప్తి ఇది. నీటికటకట నేపథ్యంలో 27 నుంచి నీటి సరఫరాలో 10 శాతం కోత విధిస్తున్నట్టు బీఎంసీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. మధ్యప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో కూడా నీటి కొరత వేధిస్తున్నది.