నలంద: ఇవాళ ఉదయం బీహార్ రాష్ట్రం నలంద జిల్లాలోని కుల్ గ్రామంలో ఆడుకుంటూ వెళ్లి బోరుబావిలో పడిన మూడేళ్ల బాలుడిని రెస్క్యూ టీమ్స్ సురక్షితంగా వెలికితీశాయి. అనంతరం అధికారులు చికిత్స నిమిత్తం ఆ బాలుడిని నలందలోని ఓ ఆస్పత్రికి తరలించారు. బాలుడికి ప్రాణాపాయం ఏమీ లేదని, కొన్నిగంటల పాటు బోరుబావిలో ఉన్నందున సాధారణ చికిత్స అవసరమవుతుందని వారు తెలిపారు.
శుభ్మన్ కుమార్ అనే మూడేళ్ల బాలుడు ఇవాళ ఉదయం ఆడుకుంటూ వెళ్లి నిరుపయోగంగా ఉన్న 40 అడుగుల లోతు బోరుబావిలో పడిపోయాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు వెంటనే అక్కడికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. బోరుబావిలోకి కెమెరాను పంపించి ఆ బాలుడు ప్రాణాలతోనే ఉన్నాడని గుర్తించారు.
బాలుడు బోరుబావి అడుగున నీళ్లలో ఉన్న దృశ్యాలను కుటుంబసభ్యులకు చూపించారు. జేసీబీల సాయంతో బోరుబావికి సమాంతరంగా గుంత తీసి బాలుడిని సురక్షితంగా బయటికి తీశారు. కాగా, గ్రామానికి చెందిన ఓ రైతు సాగునీటి కోసం బోరు వేయించి, నీళ్లు రాకపోడంతో మూసివేయకుండా అలాగే వదిలేశాడని, దాంతో బాలుడు ఆడుకుంటూ వెళ్లి అందులో పడిపోయాడని కుల్ గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ నళిన్ మౌర్య వెల్లడించారు.
#WATCH | Bihar: The child who fell into a borewell in Kul village in Nalanda has been rescued. More details are awaited. https://t.co/G6FW8RDIJJ pic.twitter.com/KQouMHkffD
— ANI (@ANI) July 23, 2023