NCP second list : మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం కొనసాగుతోంది. వ్యూహ ప్రతివ్యూహాలు, అభ్యర్థుల ఎంపికలతో పార్టీలు బిజీబిజీగా ఉన్నాయి. మరోవైపు ఇప్పటికే టికెట్ ఖరారైన కొందరు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసి ప్రచారాలు మొదలుపెట్టారు. మరికొందరు నామినేషన్లు వేసేపనిలో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో శరద్ పవార్ వర్గం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ () మరో 22 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది.
ఈ మేరకు ఎన్సీపీ-ఎస్సీపీ మహారాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్ రెండో జాబితాను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటివరకు తాము మొత్తం 67 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించామని పాటిల్ చెప్పారు. అన్ని స్థానాల్లో గెలుపు తమదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సీట్ల పంపకంపై మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ.. ఈ విషయంలో సమావేశాలు మగిశాయని చెప్పారు. ఇంకా ఏమన్నా చిన్నచిన్న మార్పులు ఉంటే ఫోన్లలో మాట్లాడుతామని అన్నారు.
మొత్తానికి మహావికాస్ అఘాడీలోని మూడు పార్టీలు ఇంచుమించుగా 90 అసెంబ్లీ స్థానాల చొప్పున బరిలో దిగుతాయని జయంత్ పాటిల్ చెప్పారు. ఇంకా రెండు, మూడు స్థానాలు ఎక్కువతక్కువలు ఏమైనా ఉంటే.. బాలాసాహెబ్ థొరాట్ కచ్చితమైన లెక్కలు చెబుతారని అన్నారు. కాగా మహారాష్ట్రలోని మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 20న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. నవంబర్ 23న ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు.