Lath maar Holi : మన దేశంలో హోళీ పండుగ (Holi festival) కు ప్రత్యేక స్థానం ఉంది. హోళీ అంటే రంగుల పండుగ (Colours festival). పిల్లా పెద్ద తేడా లేకుండా ‘హోలీ హోలీల రంగ హోలీ.. చెమ్మకేలీల హోలీ’ అని పాడుకుంటూ సంబురాలు చేసుకునే రంగునీళ్ళ పండుగ. గతంలో ఉత్తర భారతదేశానికి మాత్రమే పరిమితమైన ఈ పండుగను.. ఇప్పుడు దక్షణ భారత దేశంలో కూడా జోరుగా జరుపుకుంటున్నారు. అయితే ప్రాంతాన్ని బట్టి హోళీ జరపుకునే పద్ధతి మారుతుంది. రంగులు చల్లుకోవడం, కోలాటాలు ఆడటం, హోలీ పాటలు పాడుకోవడం సాధరణమే అయినా.. వీటికి అదనంగా ఒక్కో ప్రాంతంలో ఒక్కో పద్ధతి ఉంటుంది. ఈ ఏడాది మార్చి 14న (March 14th) హోలీ పండుగ జరగనుంది. ఈ నేపథ్యంలో హోలీ పండుగ గురించిన విశేషాలు ‘నమస్తే తెలంగాణ’ పాఠకుల కోసం..
సాధారణంగా హోళీ పండుగ ముందురోజు కాముని దహనం చేస్తారు. మండుతున్న హోళీ మంటలనే హోళీక అంటారు. హోలీ సంబురాల్లో ఇది ప్రధాన ఘట్టం. హిందూ పురాణాల ప్రకారం.. భక్త ప్రహ్లాదుడిని చంపడానికి ప్రయత్నం చేసిన హిరణ్యకశ్యపుని చెల్లెలైన హోళిక అనే రాక్షసి దహనానికి సంకేతంగా ఈ సంప్రదాయ హోలి మంటలు వేస్తారని చెబుతారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో రాక్షసుల పరాక్రమం హోళిక దహనంతో అంతమైందని అందుకు ప్రతీకగానే ఈ కామ దహనం చేస్తారని అంటారు. కామ దహనం లేదా హోళిక దహనం తరువాత హోలి ఘనంగా జరపుకుంటారు.
ఈ హోలీ పండుగను ఒక్కో ప్రదేశంలో ఒక్కో విధంగా నిర్వహిస్తారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో హోలీ పండుగ సందర్భంగా వింతవింత ఆచారాలు ఉంటాయి. ఉత్తరప్రదేశ్‌లోని మథురకు దగ్గరలో ఉన్న బర్సానా పట్టణంలో హోలీని వింత పద్ధతిలో జరుపుకుంటారు. అక్కడ హోలీ పండుగ రోజు మగవాళ్ళను లాఠీలతో కొడుతారు. ఈ ఆచారాన్నే స్థానికులు లాఠ్ మార్ హోలీ అంటారు. లాఠ్ అంటే లాఠీ అని, మార్ అంటే కొట్టడం అని అర్థం. అయితే హోలీని ఈ వింత పద్ధతిలో జరుపుకోవడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది.
పురాణ కాలంలో కొంటె క్రిష్ణుడు తనకెంతో ఇష్టమైన రాధ వాళ్ల గ్రామం బర్సానాకు వెళ్లేవాడట. అక్కడ రాధను, ఆమె స్నేహితులను ఆటపట్టించేవాడట. శ్రీ కృష్ణుడు ఆడపిల్లలను ఆట పట్టించడాన్ని గమనించిన ఆ గ్రామంలోని మహిళలు ఓసారి ఆయనను సరదాగా కర్రలతో కొడుతూ తరిమేశారట. అప్పటి నుంచి ఆ గ్రామంలో శ్రీ కృష్ణుడిని తరిమికొట్టిన సందర్భానికి గుర్తుగా ఈ వింత ఆచారాన్ని పాటిస్తున్నారట.
ప్రతి ఏడాది పొరుగున ఉన్న క్రిష్ణుడి గ్రామం నంద్ గావ్ నుంచి మగవాళ్లు మహిళలతో హోలీ ఆడటానికి బర్సానాకు వస్తారట. హుషారుగా హోలీ పాటలు పాడుతూ, ఆటలు ఆడుతూ అక్కడి ఆడవాళ్లను రెచ్చగొట్టేలా కొంటె పనులు చేస్తారట. ఈ సందర్భంగా ఆడవాళ్లు కర్రలు తీసుకుని మగవాళ్లను కొడతారట. అయితే ఆడవాళ్లు కర్రలతో కొడుతుంటే దెబ్బలు తగలకుండా మగవాళ్లు డాలు అడ్డం పెట్టుకుంటారట.
ఈ లాఠ్ మార్ హోలీ పండుగ కోసం సన్నాహాలు నెలరోజుల ముందు నుంచే మొదలవుతాయట. మగవాళ్లను బలంగా కొట్టడానికి అత్తలు తమ కోడళ్ళకు ఆ నెల రోజులపాటు మంచి పౌష్టికాహారం పెడతారట. అయితే శ్రీకృష్ణుడిని పురాణ కాలంలో కొట్టినట్టే ఇప్పటి మగవాళ్లను కూడా ఆడవాళ్లు సరదాగా కొడతారట.
#WATCH | Mathura, Uttar Pradesh: ‘Lathmaar’ Holi celebrations underway in Barsana as a part of the elaborate Holi festival celebrations. pic.twitter.com/HJfOX9A1sM
— ANI (@ANI) March 8, 2025
లాఠ్ మార్ హోలీ మాదిరిగానే హర్యానాలో కూడా వింతగా హోలీ పండుగ జరుపుకుంటారట. అక్కడ ఆ హోలీ పండుగను స్థానికులు కరోర్ మార్ హోలీ అంటారట. అక్కడ వదినలు మరదళ్ళను, బావలు బావమరుదలను కర్రలతో పిచ్చకొట్టుడు కొడుతారట. ఏడాది పొడవునా మరదళ్లు వదినల మీద, బావమరుదులు బావల మీద వేసిన జోకులకు ఆరోజు సరదాగా కసి తీర్చుకుంటారట. లాఠ్ మార్ హోలీలా ఇక్కడ దెబ్బలు తినే వాళ్లు డాలును వెంటతెచ్చుకోవద్దు. కొట్టేవాళ్లు కూడా దెబ్బలు తగులొద్దనే కాన్సెప్ట్‌ను పాటించరు. కాబట్టి ఏది అందుబాటులో ఉంటే దాన్ని అడ్డంపెట్టుకుని తప్పించుకోవాలి. లేదంటే దెబ్బలు తినాలి.