HD Kumaraswamy : కర్ణాటక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ పార్టీ అగ్రనేత హెచ్డీ కుమారస్వామి.. కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలిసారి తన తల్లిదండ్రులను కలిశారు. తన తల్లిదండ్రులు చెన్నమ్మ, దేవేగౌడ దంపతులను కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా వారికి పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు.
లోక్సభ ఎన్నికలకు ముందు ఎన్డీఏ కూటమితో కలిసిన కుమారస్వామి మాండ్య లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఈ క్రమంలో కేంద్రంలోని నరేంద్రమోదీ మంత్రివర్గంలో కుమారస్వామికి చోటు కల్పించారు. ఆయన ఉక్కు, భారీ పరిశ్రమల శాఖలు అప్పగించారు. ఆదివారం తన సహచర మంత్రులతోపాటు ఆయన కూడా ప్రమాణస్వీకారం చేశారు.
కాగా, కుమారస్వామి 2018లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నపట్న నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. తాజాగా లోక్సభ ఎన్నికల్లో గెలిచి కేంద్రమంత్రి అయ్యారు. ఈ క్రమంలో ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.