లక్నో : స్వాతంత్యం వచ్చిన 75 ఏండ్ల తర్వాత యూపీలోని ఇటా జిల్లాకు చెందిన తులై కా నగ్లా గ్రామంలో విద్యుత్ వెలుగులు ప్రసరించనున్నాయి. రానున్న రెండు నెలల్లో ఈ గ్రామానికి విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని యూపీ అధికారులు తెలిపారు. గ్రామానికి విద్యుత్ కోసం గ్రామస్తులు 60 ఏండ్లుగా చేస్తున్న విజ్ఞాపనలు ఇప్పటికి ఫలించాయి. దశాబ్ధాలుగా విద్యుదీకరణ కోసం గ్రామస్తులు అధికారులకు చేసిన విజ్ఞాపనలు, అందచేసిన ఫిర్యాదులు బుట్టదాఖలా అయ్యాయి.
తులైకా నగ్లా గ్రామానికి విద్యుత్ సౌకర్యం మరో రెండు నెలల్లో అందుబాటులోకి వస్తుందని యూపీ విద్యుత్ శాఖ మంత్రి శ్రీకాంత్ శర్మ ప్రకటించారు. గ్రామానికి విద్యుత్ వెలుగులు ప్రసరించేలా దక్షిణాంచల్ విద్యుత్ వితరణ నిగమ్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఇటీవల ఇటా జిల్లా మేజిస్ట్రేట్, విద్యుత్ శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఈ గ్రామానికి విద్యుదీకరణపై నిర్ణయం తీసుకున్నారు.