Omar Abdullah : విపక్ష పార్టీలు ఓట్ల చోరీ (Vote Chori) ఆరోపణలతో కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ అగ్రనేత (Congress top leader) రాహుల్ గాంధీ (Rahul Gandhi) దీన్ని ప్రధాన అస్త్రంగా మలుచుకున్నారు. ఈ క్రమంలో ‘ఇండియా (INDI)’ కూటమిలో భాగస్వామిగా ఉన్న నేషనల్ కాన్ఫరెన్స్ నేత, జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) కీలక వ్యాఖ్యలు చేశారు.
ఓట్ల చోరీ అంశాన్ని కేవలం కాంగ్రెస్ పార్టీ లేవనెత్తుతోందని, దానికి ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమికి ఎలాంటి సంబంధం లేదని ఒమర్ అబ్దుల్లా చెప్పారు. కాంగ్రెస్ ఆరోపిస్తున్న ఓట్ల చోరీ, ఎన్నికల్లో అక్రమాలపై ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ.. ‘ఇండియా కూటమికి ఈ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదన్నారు. ప్రతి పార్టీకి తన సొంత అజెండాను నిర్దేశించుకునే స్వేచ్ఛ ఉందని చెప్పారు. ఓట్ల చోరీ, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలను హస్తం పార్టీ తన ప్రధాన అంశాలుగా చేసుకుంది.
ఓట్ల చోరీ అంశంపై కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ‘ఓట్ చోర్… గద్దీ ఛోడ్’ బహిరంగ సభ నిర్వహించిన మరుసటి రోజే ఆయన ఈ మేరకు స్పందించారు. ‘ఇండియా’ కూటమి పరిస్థితి వెంటిలేటర్‌పై ఉన్నట్లుగా ఉందని ఒమర్ అబ్దుల్లా ఇటీవల వ్యాఖ్యానించారు. బీహార్ ఎన్నికల విషయంలో విపక్ష కూటమి పట్టింపు లేనట్లుగా వ్యవహరించిందని ఆరోపించారు. ఢిల్లీ సభలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ.. కేంద్రంలోని మోదీ సర్కారును గద్దె దించేందుకు కాంగ్రెస్ కంకణం కట్టుకుందని అన్నారు. సత్యం, అహింసా మార్గంలోనే దానిని సాధిస్తామని చెప్పారు. బీజేపీ కోసం ఎన్నికల సంఘం పనిచేస్తోందని ఆరోపించారు.