న్యూఢిల్లీ, జూలై 26: పోలెండ్‌కు చెందిన ‘వోలోనాట్’ కంపెనీ అద్భుతం సృష్టించింది. ప్రపంచంలోనే తొలి ఎయిర్బైక్ను తయారు చేసింది. సైన్స్ ఫిక్షన్ సినిమాల్లోని స్పీడర్ బైక్‌లా ఉండే ఈ సింగిల్ సీటర్ ఫ్లయింగ్ బైక్ గాలిలో గంటకు 200 కి.మీ. వేగంతో ఎగరగలదు. మన దేశంలో ఎంతో ప్రజాదరణ పొందిన ‘స్ప్లెండర్’ బైక్ కంటే నాలుగు రెట్లు తక్కువ బరువు ఉండే ఈ తేలికపాటి ఎయిర్‌బైక్ నాలుగు రకాల ఇంధనాల (డీజిల్, బయోడీజిల్, జెట్-ఏ1, కిరోసిన్)తో పనిచేస్తుంది. కేవలం 30 కిలోల బరువు ఉండే ఈ ఫ్లయింగ్ బైక్ టేకాఫ్, ల్యాండింగ్‌కు సంబంధించిన వీడియోను ‘వోలోనాట్’ కంపెనీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
ఇప్పటికే ‘జెట్సన్ వన్’ లాంటి ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ మెషీన్లను తయారు చేసిన తొమాజ్ పటాన్ ఈ ఎయిర్బైక్ను రూపొందించారు. ఇది రియల్ వరల్డ్ స్పైడర్ బైక్ అని, గాలిలో వేగంగా ఎక్కడికైనా ఎగిరి వెళ్లగలదని, 95 కిలోల బరువును మోసుకెళ్లగలదని ఆయన తెలిపారు. దీని ధరను 8.80 లక్షల డాలర్లు (దాదాపు రూ.7.37 కోట్లు)గా నిర్ణయించారు. ప్రస్తుతం ప్రొటోటైప్ దశలో ఉన్న ఈ బైక్‌ను వచ్చే నెల 1 నుంచి ‘వోలోనాట్.కామ్’ వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.