పాతనంతిట్ట: శబరిమల అయ్యప్పస్వామి(Sabarimala Pilgrimage) దర్శనాలకు చెందిన ఆన్లైన్ బుకింగ్ నవంబర్ ఒకటో తేదీ నుంచి ప్రారంభంకానున్నది. ఈ ఏడాది కూడా భారీ సంఖ్యలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం రానున్నారు. మండల పూజ సీజన్ నవంబర్ 16వ తేదీ నుంచి ప్రారంభంకానున్నది. డిసెంబర్ 27వ తేదీన ఆ సీజన్ ముగియనున్నది. అయితే దీని కోసం ట్రావన్కోర్ దేవస్థానం బోర్డు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అయ్యప్ప స్వామి దర్శనం కోసం వర్చువల్ క్యూ బుకింగ్ నవంబర్ ఒకటో తేదీన ప్రారంభించనున్నట్లు బోర్డు చెప్పింది. ప్రతి రోజు 70 వేల మంది భక్తులకు క్యూలైన్ టికెట్లను అమ్మనున్నారు. ఇక స్పాట్ బుకింగ్ కోసం 20 వేల టికెట్లను కేటాయించారు.
మండల సీజన్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో బోర్డు సమీక్షా సమావేశం నిర్వహించింది. పంబ వద్ద భారీ పందిరిని నిర్మించనున్నారు. ఒకేసారి పది వేల మంది భక్తులు సేద తీరే తరహాలో ఆ పందిరి నిర్మాణం ఉంటుంది. భక్తుల తాకిడిని తట్టుకునేందుకు సుమారు 50 లక్షల అరవణం ప్రసాదం బాటిళ్లు కూడా సిద్ధం చేస్తున్నారు. రెండు నెలల పూజల కోసం నవంబర్ 15వ తేదీ సాయంత్రం 5 గంటలకు శబరిమల ఆలయాన్ని తెరవనున్నారు. డిసెంబర్ 27వ తేదీన మూసివేసి మళ్లీ డిసెంబర్ 30వ తేదీన మకర పూజల కోసం ఆలయాన్ని ఓపెన్ చేస్తారు. డిసెంబర్ 30 నుంచి జనవరి 14వ తేదీ వరకు మకర మహోత్సవం ఉంటుంది. జనవరి 20వ తేదీన ఆ పూజలను ముగిస్తారు.