న్యూఢిల్లీ, మే 3: బీజేపీ మాజీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపులకు సంబంధించిన ఫిర్యాదులు నమోదు చేసిన ఆరుగురు మహిళా రెజ్లర్లలో తాను కూడా ఉన్నానని ప్రముఖ రెజ్లర్ వినేష్ ఫోగట్ ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్రిజ్ భూషణ్‌పై దాఖలైన కేసు విచారణ న్యాయస్థానంలో ఇప్పటికీ కొనసాగుతున్నది. ప్రస్తుతం సాక్ష్యాల నమోదు జరుగుతున్నందున తన ఉనికిని వెల్లడించకూడదని, న్యాయపోరాటం కొనసాగించాలని గతంలో తాను నిర్ణయించుకున్నానని ఆమె తెలిపారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఏ బాధితురాలి గుర్తింపును వెల్లడించరాదని, అలా చేస్తే వారి గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లుతుందని ఆదివారం సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక వీడియోలో వినేష్ తెలిపారు. కాని కొన్ని పరిస్థితుల కారణంగా తాను అన్ని విషయాలు పంచుకోదలచుకున్నానని ఆమె చెప్పారు.
కేసు కోర్టులో ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నందున తాను దానిపై మాట్లాడదలచుకోలేదని, అయితే ఫిర్యాదు చేసిన ఆరుగురు బాధితుల్లో తాను కూడా ఒకరినని చెప్పదలచుకున్నానని, ప్రస్తుతం సాక్ష్యాల నమోదు జరుగుతున్నదని వినేష్ తెలిపారు. బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా 2023లో జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనలో పాల్గొన్న ప్రధాన వ్యక్తుల్లో వినేష్ ఒకరు. బ్రిజ్ భూషణ్‌కు పలుకుబడి ఉన్న ఉత్తర ప్రదేశ్‌లోని గొండలో ర్యాంకింగ్ టోర్నమెంట్లు, ట్రయల్స్ నిర్వహించాలన్న డబ్ల్యూఎఫ్ఐ ప్రణాళికను దృష్టిలో ఉంచుకుని తాను ఇప్పుడు మాట్లాడుతున్నానని ఆమె చెప్పారు. బ్రిజ్ భూషణ్‌కు చెందిన ఓ ప్రైవేట్ కాలేజీలో ప్రస్తుతం ట్రయల్స్ జరుగుతున్నాయని, ట్రయల్స్ నిష్పాక్షికతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని ఆమె అన్నారు.
గోండలో జరిగే నేషనల్ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నమెంట్ సందర్భంగా తనకు కాని, తన జట్టుకు కాని ఎటువంటి హాని జరిగినా అందుకు భారత ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని వినేష్ హెచ్చరించారు. తాను పోటీలో పాల్గొంటున్న సందర్భంగా ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతాయోనన్న ఆందోళనను ఆమె వ్యక్తం చేశారు. బ్రిజ్ భూషణ్‌కు సంబంధించిన వేదిక వద్ద ఈ టోర్నమెంట్ జరుగుతున్నదని, ఫలితాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉందని 18 నెలల తర్వాత వీడియో సందేశం ద్వారా ప్రజల ముందుకు వచ్చిన వినేష్ అనుమానం వ్యక్తం చేశారు. పోటీ సందర్భంగా మీడియా, క్రీడా సమాజం వేదిక వద్ద ఉండాలని ఆమె కోరారు. ఆయన(బ్రిజ్) పలుకుబడి బలంగా ఉన్న చోట టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఏ బౌట్‌కు ఎవరు అంపైర్‌గా వ్యవహరిస్తారు. ఎన్ని పాయింట్లు వేస్తారు. మ్యాట్ చైర్మన్‌గా ఎవరు కూర్చుంటారు. వీటన్నిటినీ ఆయన, ఆయన మనుషులు నియంత్రిస్తారు అని వినేష్ వ్యాఖ్యానించారు.
తాను తిరిగి శిక్షణ పొందానని, పతకాలు గెలవడానికి పోటీలకు తిరిగి రాదలచానని 31 ఏండ్ల వినేష్ చెప్పారు. అయితే న్యాయమైన అవకాశం దక్కుతుందని తాను కచ్చితంగా చెప్పలేనని ఆమె అన్నారు. తనకు ఎటువంటి ప్రత్యేక సదుపాయాలు లేదా ప్రత్యేక మర్యాదలు అవసరం లేదని, పోటీలో ఉన్న క్రీడాకారుల కష్టానికి తగ్గట్టుగా ఫలితాలు కనిపించాలని మాత్రమే తాను కోరుకుంటున్నట్లు ఆమె చెప్పారు. టోర్నమెంట్లో తన సామర్థ్యాన్ని 100 శాతం ప్రదర్శించడంపై ఆమె సందేహం వ్యక్తం చేశారు. టోర్నమెంట్ నిర్వహణ బాధ్యతను పూర్తిగా బ్రిజ్ భూషణ్‌కు అప్పగించి ప్రభుత్వం, క్రీడా శాఖ ప్రేక్షకపాత్ర పోషిస్తున్నాయని ఆమె విమర్శించారు.