మహూ (మధ్యప్రదేశ్), మే 7: ప్రభుత్వ అలసత్వ పోకడలు, అసమర్థ విధానాలను ఒకస్థాయి వరకే సామాన్యులు భరిస్తారు. అప్పటికీ, ప్రభుత్వ ధోరణి మారకపోతే తిరుగుబాటు మొదలవుతుంది. పొరుగున ఉన్న శ్రీలంకలో ప్రజా ఉద్యమం పెల్లుబికి రావడానికి అదే కారణం. ఇప్పుడు అలాంటి పరిస్థితులు దేశంలోనూ తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. విద్యుత్తు కోతలతో విసిగివేసారిన ఓ గ్రామస్థులు ఏకంగా సబ్స్టేషన్కే నిప్పు పెట్టారు. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకొన్నది.
ఎన్నికలప్పుడే వస్తారు..
నడి వేసవిలో గంటల కొద్దీ విద్యుత్తు కోతలు విధిస్తుండటంతో మధ్యప్రదేశ్‌లోని దటోడా గ్రామంలోని ప్రజలు కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యుత్తు సరఫరా లేనప్పుడు సబ్‌స్టేషన్ ఉండి లాభమేంటని భావించారు. దీంతో డీజిల్, కిరోసిన్‌తో శుక్రవారం రాత్రి సబ్‌స్టేషన్‌కు నిప్పుపెట్టారు. దీంతో స్టేషన్‌లోని కంట్రోల్ ప్యానెల్, రిలే వ్యవస్థ పూర్తిగా దగ్ధమయ్యింది. సబ్‌స్టేషన్‌కు నిప్పు పెట్టేముందు కొందరు రాళ్లు రువ్వారని, అడ్డుకోబోయిన ఆపరేటర్లపై దాడులకు పాల్పడ్డారని అధికారులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మరికొందరి కోసం వెదుకుతున్నారు. విద్యుత్తు కోతలతో పంటలు ఎండిపోయాయని, రాత్రైతే ఇండ్లల్లో కొవ్వత్తులే దిక్కుగా మారుతున్నాయని పలువురు గ్రామస్థులు వాపోయారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వీధి, వీధికి తిరిగిన నాయకులు.. ఇలాంటి సమయాల్లో తమ గ్రామం వైపు కూడా చూడట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కృత్రిమ కొరత సృష్టించారు
కేంద్రంలో, మధ్యప్రదేశ్‌లో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు కృత్రిమ బొగ్గు కొరత సృష్టించిందని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి ప్రియావ్త్ సింగ్ ఆరోపించారు. ఇండోనేషియా వంటి దేశాల నుంచి బొగ్గును దిగుమతి చేసుకొని, బడా వ్యాపారవేత్తకు చెందిన పోర్టులలో స్టాక్ పెట్టేందుకే బొగ్గు కొరత అంటూ నాటకం ఆడుతున్నదని మండిపడ్డారు. కోల్ ఇండియా లిమిటెడ్‌కు రాష్ట్ర ప్రభుత్వం రూ. 12 వేల కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉన్నదని, అందుకే వాళ్లు బొగ్గు సరఫరా చేయలేదని పేర్కొన్నారు. మరోవైపు, రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్తు సంక్షోభంపై అసెంబ్లీలో ప్రత్యేక చర్చ నిర్వహించాలని సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు విపక్ష నాయకుడు గోవింద్ సింగ్ శనివారం లేఖ రాశారు. ఒకవైపు బొగ్గు కొరత లేదని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం మరోవైపు బొగ్గు దిగుమతులకు సిద్ధపడటమేంటని ప్రశ్నించారు.