Karur stampede : తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రంలోని కరూర్ జిల్లా (Karur district) లో టీవీకే ప్రచార ర్యాలీలో జరిగిన తొక్కిసలాట (Stampede) అంశం రాజకీయరంగు పులుముకుంది. ఈ తొక్కిసలాట వెనుక కుట్ర కోణం ఉందని, స్వతంత్ర దర్యాప్తు జరపాలని టీవీకే (TVK).. మద్రాస్ హైకోర్టు (Madras High Court) ను ఆశ్రయించింది.
ర్యాలీ జరుగుతుండగా కొందరు రాళ్లు రువ్వారని, ఆ వెంటనే పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారని, దాంతో అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని టీవీకే కోర్టుకు తెలిపింది. ఆ గందరగోళ పరిస్థితుల్లోనే తొక్కిసలాట చోటుచేసుకుందని ఆరోపించింది. అందుకే ఘటనపై స్వతంత్ర దర్యాప్తు కోరుతున్నామని సోమవారం మద్రాస్ హైకోర్టులోని మధురై బెంచ్‌లో టీవీకే పిటిషన్ వేసింది.
ఘటనపై విచారణను ప్రత్యేక దర్యాప్తు బృందం లేదా సీబీఐకి అప్పగించాలని కోరామని టీవీకే న్యాయవాది అరివళగన్ ఓ వార్తా సంస్థకు చెప్పారు. ఘటనలో కుట్ర కోణం ఉందనేందుకు స్థానిక ప్రజల నుంచి తమకు విశ్వసనీయ సమాచారం ఉందని చెప్పారు. అందుకు సంబంధించి కొన్ని సీసీటీవీ దృశ్యాలు కూడా ఉన్నట్లు తెలిపారు.
టీవీకే ర్యాలీలో నిబంధనలను ఉల్లంఘించారంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఆరోపణలను అరివళగన్ తోసిపుచ్చారు. గత రెండు నెలలుగా పలు ప్రాంతాల్లో కార్యక్రమాలు నిర్వహించగా.. ఎక్కడా ఇలాంటి ఘటన చోటుచేసుకోలేదన్నారు. కానీ కరూర్‌లోనే తొక్కిసలాట జరగడంపై సందేహాలు ఉన్నట్లు తెలిపారు. కాగా ఈ తొక్కిసలాటలో 39 మంది ప్రాణాలు కోల్పోయారు. 50 మందికిపైగా గాయపడ్డారు.