Direct-To-Mobile | న్యూఢిల్లీ, జనవరి 16: మొబైల్ యూజర్లు సిమ్ కార్డు, ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా వీడియోలను చూసే సదుపాయం త్వరలో అందుబాటులోకి రానున్నది. సంబంధిత అధునాతన సాంకేతికత ‘డైరెక్ట్ టూ మొబైల్(డీ2ఎం)’ బ్రాడ్‌కాస్టింగ్ సమీప భవిష్యత్తులో వాస్తవ రూపంలోకి రానున్నది. దీనిపై కేంద్ర సమాచార, ప్రసార శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర కీలక విషయాలు వెల్లడించారు. దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ డీ2ఎం సాంకేతికత ట్రయల్స్‌ను త్వరలో 19 నగరాల్లో చేపడతామని తెలిపారు.
ఈ టెక్నాలజీకి 470-582 మెగాహెర్జ్ స్పెక్ట్రమ్‌ను రిజర్వ్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో యూజర్లు వినియోగిస్తున్న కంటెంట్‌లో 69 శాతం వీడియో ఫార్మాట్లోనిదేనని పేర్కొన్నారు. 25-30 శాతం వీడియో కంటెంట్ ట్రాఫిక్‌ను డీ2ఎంకు మార్చడం ద్వారా 5జీ నెట్‌వర్క్‌లపై భారం తగ్గించొచ్చని అభిప్రాయపడ్డారు. ఈ డీ2ఎం సాంకేతికతను పరీక్షించేందుకు గత ఏడాది బెంగళూరు, న్యూఢిల్లీ పరిధిలోని కర్తవ్యపథ్, నోయిడాల్లో పైలట్ ప్రాజెక్టు చేపట్టారు. డీ2ఎం బ్రాడ్‌కాస్టింగ్ టెక్నాలజీని ఐఐటీ కాన్పూర్, సాంఖ్య ల్యాబ్స్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.