చెన్నై: పశువైద్యుడు కాపాడి చికిత్స అందించిన కోతి పిల్లను అటవీ శాఖ అధికారులు జూకు అప్పగించారు. ఆ కోతి పిల్ల అనారోగ్యానికి గురైంది. ఈ విషయం తెలిసి ఆ పశువైద్యుడు తల్లడిల్లిపోయాడు. (Veterinarian And Monkey) ఆ కోతి పిల్ల సంరక్షణ కోసం కోర్టును ఆశ్రయించాడు. కోర్టు సానుకూలంగా స్పందించింది. మనుషులు, జంతువుల మధ్య అనుబంధం చాలా సున్నితమైనదని పేర్కొంది. తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన పశువైద్యుడు డాక్టర్ వల్లైయప్పన్కు గత ఏడాది డిసెంబర్లో కుక్కలు దాడి చేసి కరిచిన కోతి పిల్ల కంటపడింది. దానిని కాపాడిన ఆయన తన వద్ద ఉంచుకుని పది నెలలపాటు చికిత్స అందించాడు.
కాగా, అక్టోబర్‌లో అటవీ శాఖ అధికారులు ఆ కోతి పిల్లను స్వాధీనం చేసుకున్నారు. చెన్నైలోని అరిగ్నార్ అన్నా జూలాజికల్ పార్కుకు దానిని తరలించారు. అయితే జూలో ఉన్న ఆ కోతి పిల్ల పాక్షికంగా పక్షవాతానికి గురైంది. ఈ విషయం తెలిసి పశువైద్యుడు వల్లైయప్పన్ తల్లడిల్లిపోయాడు. సంరక్షణ కోసం ఆ కోతి పిల్లను తనకు అప్పగించాలని కోరుతూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు. పూర్తిగా కోలుకోని దానిని అటవీ శాఖ అధికారులు జూకు అప్పగించారని తెలిపాడు.
మరోవైపు పశువైద్యుడు వల్లైయప్పన్ పిటిషన్‌పై విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు సానుకూలంగా స్పందించింది. మనుషులు, జంతువుల మధ్య అనుబంధం చాలా సున్నితమైనదని పేర్కొంది. జూలోని కోతి పిల్లను శనివారం సందర్శించేందుకు అతడికి అనుమతి ఇచ్చింది. దాని ఆరోగ్యంపై నివేదిక ఇవ్వాలని కోరింది. ఆ రిపోర్ట్‌ను పరిశీలించిన తర్వాత అతడి అభ్యర్థనపై తగిన నిర్ణయం తీసుకుంటామని కోర్టు పేర్కొంది.