న్యూఢిల్లీ: బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీని మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. బుధవారం రాత్రి 9 గంటలకు ఆయనను అపోలో హాస్పిటల్లో చేర్పించినట్లు సమాచారం. న్యూరాలజీ విభాగం వైద్యులు ఆయనను పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తున్నది. అద్వానీ ఆరోగ్యం నిలకడగా ఉందని, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని తెలిసింది. ఆయన ఇటీవల అస్వస్థతకు గురికావడంతో ఎయిమ్స్‌లో చికిత్స పొంది డిశ్చార్జి అయ్యారు.
కేజ్రీవాల్ కస్టడీ పొడిగింపు
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీని ఈ నెల 12 వరకు పొడిగించారు. మద్యం విధానం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై ఆయనను ఈడీ అరెస్ట్ చేసింది. ఇదే కేసులో సీబీఐ కూడా ఆయనను అరెస్ట్ చేసింది. తీహార్ జైలులో ఉన్న ఆయనను వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా స్పెషల్ జడ్జి కావేరీ బవేజా సమక్షంలో బుధవారం హాజరుపరిచారు. ఆయన జ్యుడిషియల్ కస్టడీని ఈ నెల 12 వరకు పొడిగిస్తూ జడ్జి ఆదేశాలిచ్చారు.
ఎన్ఎంసీ చీఫ్‌గా గంగాధర్
న్యూఢిల్లీ: నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) చైర్‌పర్సన్‌గా డాక్టర్ బీఎన్ గంగాధర్, మెడికల్ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డ్ ప్రెసిడెంట్‌గా డాక్టర్ సంజయ్ బేహారి నియమితులయ్యారు. క్యాబినెట్ నియామకాల కమిటీ బుధవారం వీరి నియామకాలకు ఆమోదం తెలిపింది. డాక్టర్ గంగాధర్ గతంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్ డైరెక్టర్‌గా పని చేశారు. ఆయన ఎన్ఎంసీ అఫిసియేటింగ్ చైర్మన్‌గా గత ఏడాది సెప్టెంబరు నుంచి పని చేస్తున్నారు.
స్మార్ట్ సిటీలకు గడువు పొడిగింపు
న్యూఢిల్లీ: స్మార్ట్ సిటీస్ మిషన్ గడువును వచ్చే ఏడాది మార్చి వరకు పొడిగించినట్లు కేంద్రం తెలిపింది. మొత్తం ప్రాజెక్టుల్లో 10% ప్రాజెక్టుల పనులు ప్రస్తుతం జరుగుతున్నాయని, వీటిని పూర్తి చేయడానికి గడువును పెంచాలని చాలా రాష్ర్టాలు కోరినట్లు వివరించింది.