న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలను భారత్ ధ్వంసం చేసింది. అయితే ‘ఆపరేషన్ సిందూర్’తో (Operation Sindoor) చేపట్టిన సైనిక చర్యపై చైనా మీడియాలో తప్పుడు కథనాలు ప్రచురించడంపై భారత్ మండిపడింది. వాస్తవాలను ధృవీకరించుకోవాలని సూచించింది. ‘భారతదేశం నిర్వహించిన వైమానిక దాడులకు ప్రతిస్పందనగా పాకిస్థాన్ వైమానిక దళం (పీఏఎఫ్) మరో భారతీయ యుద్ధ విమానాన్ని కూల్చివేసింది’ అని చైనాలోని గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. పాకిస్థాన్ సైనిక వర్గాల నుంచి ఈ సమాచారం అందినట్లు తెలిపింది.
కాగా, చైనా మీడియా సంస్థ గ్లోబల్ టైమ్స్‌లో వచ్చిన ఈ కథనాన్ని భారత్ ఖండించింది. ‘ఈ రకమైన తప్పుడు సమాచారాన్ని బయటకు నెట్టే ముందు వాస్తవాలను ధృవీకరించుకోవాలి. మీ మూలాలను క్రాస్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి’ అని సూచించింది. అలాగే ఆపరేషన్ సిందూర్‌పై పాకిస్థాన్ అనుకూల వర్గాలు నిరాధారమైన కథనాలు వ్యాప్తి చేసి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని విమర్శించింది. పాత చిత్రాలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయం ఆరోపించింది.