న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ ఆఫీసు ఇవాళ కరోనా నియంత్రణ మార్గదర్శకాలను జారీ చేసింది. మహమ్మారి కోవిడ్‌ను రూపుమాపేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యల గురించి సైంటిఫిక్ అడ్వైజర్ ఆఫీసు కొన్ని సూచనలు చేసింది. వైరస్ వ్యాప్తి అడ్డుకుని.. మహమ్మారిని తుదముట్టించాలంటే.. మాస్క్‌లు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, శానిటైజ్ కావాలన్నది. ఇక సార్స్ సీవోవీ2 వైరస్ నియంత్రణలో వెంటిలేషన్ అత్యంత కీలకమైనదన్నట్లు పీఎస్ఏ పేర్కొన్నది. వైరస్ సోకిన వ్యక్తి నుంచి వచ్చే తుంపర్లు రెండు మీటర్లు.. ఏరోసోల్స్ పది మీటర్ల వరకు వ్యాప్తి చెందుతాయని సైంటిఫిక్ అడ్వైజరీ శాఖ వెల్లడించింది.
కరోనా వైరస్ గాలి ద్వారా వ్యాపిస్తుందన్న విషయం తెలిసిందే. అయితే ఆ గాలిలో ఉన్న వైరల్ లోడ్‌ను నిర్వీర్యపరచాలంటే.. సరైన వెంటిలేషన్ అవసరమని సైంటిఫిక్ అడ్వైజర్ బృందం పేర్కొన్నది. ఇండ్లల్లో గాలి ప్రసరణ సరిగా ఉంటే.. వైరస్ వ్యాప్తి కూడా అదుపులో ఉంటుందన్నది. సరైన రీతిలో గాలి ప్రసరణ లేని ఇండ్లల్లో వైరస్ వ్యాప్తి అధికంగా ఉంటుందని ఆ శాఖ చెప్పింది. వ్యాధి సోకిన వారి నుంచి మరొకరికి వైరస్ సోకకుండా ఉండాలంటే.. ఇండ్లల్లో, ఆఫీసుల్లో గాలి ప్రసరణ జరిగే కిటికీలు ఉండాలని, ఉత్తమ వెంటిలేషన్ వల్ల ఎటువంటి సమస్యలు ఉండవని ఆ మార్గదర్శకాల్లో తెలిపారు.
చెడు వాసన వచ్చినప్పుడు ఎలా మనం మన ఇంట్లో ఉన్న డోర్లు, కిటికీలు తీస్తామో.. అలాగే గాలిలో ఉన్న వైరల్ లోడ్‌ను తగ్గించేందుకు సరైన రీతిలో వెంటిలేషన్ ఉండాలని సైంటిఫిక్ అడ్వైజర్ ఆఫీసు పేర్కొన్నది. గాలి ప్రసరణ సక్రమ మార్గంలో ఉంటే.. అప్పుడు గాలిలో వైరల్ ప్రభావం తక్కువగా ఉంటుందని చెప్పింది. బయటి నుంచి ఇంట్లోకి గాలి రావడం.. ఇంట్లో నుంచి గాలి బయటకు వెళ్లడం లాంటి చర్యలతో వైరల్ లోడ్‌ను తగ్గించవచ్చన్నది. ఇండ్లల్లో, ఆఫీసుల్లో వెంటిలేషన్ పెంచేందుకు కావాల్సిన చర్యలు చేపట్టాలని ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ ఆఫీసు తన మార్గదర్శకాల్లో సూచించింది. క్రాస్ వెంటిలేషన్, ఎగ్జాస్ట్ ఫ్యాన్ల వల్ల వ్యాధి వ్యాప్తిని అరికట్టవచ్చు అని తెలిపింది.
వైరస్ సోకిన వ్యక్తి శ్వాస వదిలినా.. మాట్లాడినా.. పాడినా.. నవ్వినా, దగ్గినా, తుమ్మినా.. వైరస్ వ్యాప్తి అవుతుందని, ఎటువంటి లక్షణాలు లేని పాజిటివ్ వ్యక్తులతోనూ వైరస్ వ్యాప్తి అవుతుందని, అందుకే ప్రజలు మాస్క్‌లు ధరించాలని, వీలైతే డబుల్ మాస్క్ లేదా ఎన్95 మాస్క్‌లు ధరించాలని అడ్వైజరీలో పేర్కొన్నారు.
Office of the Principal Scientific Adviser to the Government of India releases Advisory on “Stop the Transmission, Crush the Pandemic – Masks, distance, sanitation and ventilation to prevent the spread of SARS-CoV-2 virus”
— PIB India (@PIB_India) May 20, 2021
🔗https://t.co/mUYUBXGuic
➡️https://t.co/y5NABoHYhs pic.twitter.com/MSTJCi50Ba