న్యూఢిల్లీ: వర్దమాన్ గ్రూప్ అధినేత ఎస్పీ ఓస్వాల్(SP Oswal)ను మోసం చేశారు. ఆయన వద్ద నుంచి ఏడు కోట్లు లాగేశారు. సీజేఐ డీవై చంద్రచూడ్ గెటప్‌లో.. ఓ వర్చువల్ ఫేక్ కోర్టురూమ్ను తయారు చేసి.. ఎస్పీ ఓస్వాల్‌ను బెదిరించారు. టెక్స్టైల్ సంస్థ ఎండీ అయిన ఓస్వాల్.. ఆగస్టు 28, 29వ తేదీల్లో డిజిటల్ చోరీకి గురయ్యారు. పలు అకౌంట్లకు ఏడు కోట్లు బదిలీ చేసేలా ఆయన్ను వత్తిడి చేశారు. అయితే ఆ అకౌంట్లను ఫ్రీజ్ చేసి, వాటి నుంచి సుమారు అయిదు కోట్లు రికవరీ చేశారు. సైబర్ నేరగాళ్లు ఎలా మోసం చేశారన్న విషయాన్ని ఆ వ్యాపారవేత్త వివరించారు. మనీ ల్యాండరింగ్ కేసులో విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందని బెదరిస్తూ.. ఆ సైబర్ గ్యాంగ్ ఆయన వద్ద నుంచి ఏడు కోట్లు వసూల్ చేశారు. మీ పేరుతో కెనరా బ్యాంక్ అకౌంట్ ఉందని, ఆ అకౌంట్ నుంచి ఆర్థిక అక్రమాలు జరిగాయని ఆ గ్యాంగ్ బెదిరించింది. ఆ అకౌంట్‌కు నరేశ్‌గోయల్ కేసుతో లింకు ఉన్నట్లు మోసగాళ్లు బెదిరించినట్లు తెలుస్తోంది.
వీడియోకాల్ చేసి ఓ ఫేక్ కోర్టురూమ్ను సృష్టించారు. ఆ కోర్టు రూమ్‌లో సీజేఐ చంద్రచూడ్ తన కేసును విచారిస్తున్నట్లు ఫ్రాడ్స్టర్లు చూపించారని ఓస్వాల్ తెలిపారు. వాట్సాప్ ద్వారా సీజే ఇచ్చిన ఆదేశాలను పంపించారు. ఆ ఆదేశాల ప్రకారం ఓస్వాల్ వేర్వేరు అకౌంట్లలో ఏడు కోట్లు జమ చేశాడు. నరేశ్ గోయల్ కేసు నుంచి రక్షిస్తామని హామీ ఇస్తూ.. ఫేక్ సుప్రీంకోర్టు ఆదేశాలు తనకు పంపినట్లు ఓస్వాల్ తెలిపారు.
ఓస్వాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆగస్టు 31వ తేదీన కేసు నమోదు చేశారు. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని సైబర్ క్రైం సెంటర్ ద్వారా మూడు అకౌంట్లను సీజ్ చేశారు. వాటి నుంచి 5.25 కోట్లు రికవరీ చేశారు. ఈ నేరం వెనుక అంతరాష్ట్ర గ్యాంగ్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతాను చౌదరీ, ఆనంద్ కుమార్‌ను గౌహతిలో అరెస్టు చేశారు. ఆ ఇద్దరూ వ్యాపారులే. ఈ కేసులో మాస్టర్‌మైండ్, బ్యాంక్ ఉద్యోగి రూమి కాలిటా కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిమ్మి భట్టాచార్య, అలోక్ రంగి, గులామ్ ముర్తాజా, జాకిర్ కూడా ఈ కేసులో నిందితులుగా ఉన్నారు.