Vande Bharat Express | సెమీ హైస్పీడ్ రైలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు తరుచుగా ప్రమాదానికి గురవుతున్నాయి. రైళ్లపై దాడులు, లేదంటే జంతువులను ఢీకొట్టిన ఘటనల్లో ఇప్పటికే పలు రైళ్లు దెబ్బతిన్న విషయం తెలిసిందే. తాజాగా పూరీ – హౌరా మార్గంలో కొత్తగా ప్రారంభించిన రైలు ప్రమాదానికి గురైంది. ఈదురుగాలులతో వీచిన వర్షానికి చెట్టుకొమ్మలు విరిగి వందే భారత్ రైలు విండ్షీల్డ్పై పడ్డాయి. దాంతో రైలు అద్దాలు పగిలిపోయాయి. ఈ ఘటన ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లా బైతరణి రోడ్ – మంగ్గీ రోడ్ స్టేషన్ల మధ్య సాయంత్రం 4.45 గంటల ప్రాంతంలో జరిగిందని సౌత్ ఈస్టర్న్ రైల్వే అధికారి తెలిపారు.
ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని, గాలివానకు చెట్టుకొమ్మలు రైలుపడ్డాయని పేర్కొన్నారు. పూరీ నుంచి హౌరా వెళ్తున్న రైలు ప్యాంటోగ్రాఫ్లో చెట్ల కొమ్మలు ఇరుక్కుపోయాయి. రైలు పైలట్ క్యాబిన్ అద్దాలు పగిలిపోయాయి. పాంటోగ్రాఫ్ ఓవర్ హెడ్ వైర్‌తో చిక్కుకోవడంతో రైలుకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వందే భారత్ రైలును డీజిల్ ఇంజిన్ సహాయంతో మంగ్గీ రోడ్స్టేషన్కు తరలించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. మరమ్మతులు పూర్తయిన తర్వాత రైలు గమ్యస్థానానికి బయలుదేరనున్నది. అయితే, ఈ రైలును గత గురువారమే ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి రైలును ప్రారంభించారు. కమర్షియల్ ఆపరేషన్ శనివారమే మొదలైంది. రెండో రోజైన ఆదివారమే ప్రమాదానికి గురైంది.