UP Assembly : ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) అసెంబ్లీ (Assembly) లో బడ్జెట్ సమావేశాల సందర్భంగా మంగళవారం ఒక జుగుప్సాకరమైన ఘటన చోటుచేసుకుంది. ఓ ఎమ్మెల్యే సమావేశాలు జరుగుతుండగానే పాన్ మసాలా (Pan Masala) నమిలి హాల్లోనే ఉమ్మేశాడు. లంచ్ విరామం సమయంలో అది గమనించిన స్పీకర్ సతీష్ మహానా సిబ్బందితో కలిసి శుభ్రం చేశారు. లంచ్ తర్వాత సెషన్ ప్రారంభమవగానే ఉమ్మివేసిన ఘటనపై సీరియస్‌గా స్పందించారు.
సభ్యులు సభా ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని కోరారు. అసెంబ్లీ హాల్లో ఉమ్మివేసిన ఎమ్మెల్యే ఎవరో తనకు తెలుసని, వీడియోలో చూశానని చెప్పారు. ఆ ఎమ్మెల్యే తనకు తానుగా తన దగ్గరికి వచ్చి వివరణ ఇవ్వాలని, లేదంటే తానే తన ఛాంబర్‌కు పిలువాల్సి ఉంటుందని హెచ్చరించారు. సభలో మరోసారి ఇలాంటి ఘటన చోటుచేసుకోకుండా అందరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
‘విధాన సభ హాల్లో ఉదయం జరిగిన ఓ ఘటన గురించి మీకు చెప్పాలి. సభ్యుల్లో ఒకరు పాన్ మసాలా నమిలి అక్కడే ఉమ్మేశారు. విషయం తెలియగానే నేను స్వయంగా వెళ్లి సిబ్బందితో కలిసి శుభ్రం చేశాను. అక్కడ ఉమ్మేసిన ఎమ్మెల్యే ఎవరో నేను వీడియోలో చూశాను. ఆయన పేరు చెప్పి పరువు తీయాలని అనుకోవడం లేదు. ఆయన తనంతట తానుగా నా దగ్గరకు వచ్చి వివరణ ఇవ్వాలి. లేదంటే నేనే పిలవాల్సి వస్తుంది’ అని స్పీకర్ వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా ఆయన అందరికీ ఒక విజ్ఞప్తి చేశారు. ‘ఇక నుంచి ఎవరైనా అలా చేయడం గమనిస్తే వెంటనే అడ్డుకోండి. అసెంబ్లీని శుభ్రంగా ఉంచడం మనందరి బాధ్యత’ అన్నారు. అయితే అసెంబ్లీ హాల్లో ఎమ్మెల్యే ఉమ్మేసిన చోటుకు స్పీకర్ వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సభలో ఇలా చేయడం ఏమిటని నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
🚨One MLA spat after consuming pan masala inside UP assembly. He has been identified through CCTV footage & will have to pay for the carpet.
Name and shame him publicly. pic.twitter.com/D1aUeOKvLU
— BALA (@erbmjha) March 4, 2025