కొల్లాం: కేరళకు చెందిన సూరజ్ తన భార్యను విష సర్పంతో కాటేయించి చంపించిన ఘటన తెలిసిందే. ఆ కేసులో ఇవాళ ట్రయల్ కోర్టు తీర్పును వెలువరించింది. భార్య ఉత్ర మరణానికి కారణమైన భర్త సూరజ్‌కు కోర్టు రెండుసార్లు జీవితఖైదు శిక్షలను విధించింది. కొల్లాం అడిషనల్ సెషన్స్ జడ్జి ఎం మనోజ్ తీర్పనిస్తూ.. ఇది అత్యంత అరుదైన కేసు అని అన్నారు. నిందితుడు సూరజ్‌కు మరణశిక్ష విధించాలని ప్రాసిక్యూషన్ కోరినా.. కోర్టు మాత్రం డబుల్ జీవిత ఖైదు శిక్షను ఖరారు చేసింది. సూరజ్‌పై నమోదు అయిన కేసుల్లో .. ఓ కేసులో పదేళ్లు, మరో కేసులో ఏడేళ్ల శిక్ష పడింది. మొత్తంగా సూరజ్ 17 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. జీవితఖైదు శిక్షతో పాటు అతనికి 5 లక్షల జరిమానా విధించారు.
2020 మార్చిలో ఉత్రపైకి ఒక విషసర్పాన్ని వదిలాడు సూరజ్. దాని కాటుతో ఉత్ర తీవ్ర అనారోగ్యంపాలైంది. 52 రోజులపాటు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నాక కోలుకుంది. ఆ వెంటనే రూ.10 వేలు ఖర్చుపెట్టి మరోసారి పాములు పట్టే సురేష్ అనే వ్యక్తిని సూరజ్ పిలిపించాడు. అతని సాయంతో మే నెలలో తాచుపామును భార్యపైకి పంపించాడు. అది కూడా ఆమెను కాటేసింది. అయితే ఈసారి ఆమె కన్నుమూసింది.
కుమార్తె మరణంపై అనుమానం వచ్చిన ఉత్ర తల్లిదండ్రులను పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘోరం బయటపడింది. పాములు పట్టే సురేష్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత అతను అప్రూవర్‌గా మారి జరిగిందంతా పోలీసులకు చెప్పేశాడు. ఈ కేసును అత్యంత అరుదైనదిగా భావించాలని వాదించిన న్యాయవాది, సూరజ్‌కు మరణశిక్ష విధించాలని డిమాండ్ చేశారు.