న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2 : పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. మూడు రోజుల్లో రెండవసారి ఇరాన్‌పై అమెరికా దాడి చేసింది. మంగళవారం రాత్రి సిరిక్, ఖుజెస్థాన్, ఖేషమ్ ద్వీపం, బందర్ అబ్బాస్‌పై అమెరికా సైన్యం క్షిపణి, డ్రోన్ దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో 12 మంది మరణించగా 68 మందికిపైగా గాయపడ్డారని ఇరాన్ వెల్లడించింది. సిరిక్‌లో ఒక వివాహ వేడుకపై క్షిపణి దాడి జరగడంతో ఐదుగురు మరణించగా 68 మంది గాయపడినట్టు ఇరాన్ వెల్లడించింది. మృతుల్లో ఒక నాలుగేండ్లచిన్నారి ఉన్నట్టు మెహర్ న్యూస్ పేర్కొంది. దాడి తర్వాత వెలుగులోకి వచ్చిన వీడియోలు, చిత్రాలలో గాయపడిన పిల్లలు దవాఖానలో చికిత్స పొందుతూ కనిపించారు. కాగా ఖజకి స్థాన్ ప్రావిన్సుపై జరిగిన దాడిలో ఏడుగురు మరణించగా, 8 మంది గాయపడ్డారు.
ఖజకిస్థాన్ ప్రావిన్సులోని మూడు ప్రాంతాల్లో మంగళవారం రాత్రి అమెరికా జరిపిన క్షిపణి దాడుల్లో 12 మంది మరణించగా 68 మంది గాయపడ్డారని ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది. అయితే, తాము ఇరాన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నామని అమెరికా పేర్కొంది. హొర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్(ఐఆర్జీసీ) దాడి యత్నాలకు ప్రతిస్పందనగానే ఇరాన్‌పై దాడులు చేశామని అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఇరాన్ వైమానిక రక్షణ స్థావరాలు, రాడార్ వ్యవస్థలు, సముద్ర ఆస్తులు, సౌకర్యాలు, మైన్లు అమర్చే సామర్థ్యాలు, కమ్యూనికేషన్ కేంద్రాలపై దాడి చేసినట్టు సెంట్రల్ కమాండ్ తెలిపింది. పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపినట్టు ఇరాన్ నుంచి వస్తున్న వార్తలను అమెరికా సైన్యం ఖండించింది. ఐఆర్‌జీసీకి భిన్నంగా అమెరికా సైన్యం ఎప్పుడూ పౌరులను లక్ష్యంగా చేసుకోదని అమెరికా నావికాదళ కెప్టెన్ టిమ్ హాకిన్స్ స్పష్టం చేశారు.
ఈ దాడులకు ప్రతీకారంగా జోర్డాన్, బెహ్రెయిన్‌లోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ దాడులలో పలువురు మరణించారని సమాచారం. ప్రభుత్వ మీడియా కథనాల ప్రకారం కువైట్‌లోని అమెరికన్ సైనిక స్థావరాలపై కూడా ఇరాన్ దాడులు నిర్వహించినట్లు సమాచారం. దాడుల అనంతరం, దురాక్రమణదారులకు కఠిన శిక్ష తప్పదు అని ఐఆర్జీసీ ప్రతినిధి హుస్సేన్ మొహబీ ఎక్స్ వేదికగా హెచ్చరించారు. అమెరికా తన కొత్త దాడులకు చింతిస్తుందని కూడా ఆయన పేర్కొన్నారు. ఇరాన్ పార్లమెంట్‌లోని జాతీయ భద్రత, విదేశాంగ విధాన కమిటీ అధిపతి ఇబ్రహీం అజిజీ కూడా ఎక్స్ వేదికగా అమెరికన్ దాడులను తీవ్రంగా ఖండించారు. ఈ నేరాలకు శిక్ష తప్పదని ఆయన హెచ్చరించారు. ఇరాన్ సాయుధ దళాల నుంచి వారిని ఏ శక్తీ కాపాడలేదని ఆయన పేర్కొన్నారు. యూఏఈలోని అల్ దఫ్రా, అల్ మిన్హాద్ స్థావరాల్లో ఉన్న అమెరికా దళాల స్థావరాలు, రాడార్ వ్యవస్థలను తమ సైన్యానికి చెందిన డజన్ల కొద్దీ డ్రోన్లు లక్ష్యంగా చేసుకున్నాయని ఇరాన్ సైన్యం తెలిపింది. అలాగే రాడార్ వ్యవస్థలు, దళాల సమీకరణ కేంద్రాలను కూడా లక్ష్యంగా చేసుకున్నట్టు సైన్యం తెలిపింది.