న్యూఢిల్లీ, జూన్ 23: అమెరికాలోని ఆర్కాన్సాన్స్ రాష్ట్రంలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో నలుగురు పౌరులు ప్రాణాలు కోల్పోగా, మృతుల్లో ఓ తెలుగు యువకుడు ఉన్నాడని తెలిసింది. మృతుడు ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాకు చెందిన దాసరి గోపీకృష్ణ (32)గా గుర్తించారు. సూపర్ మార్కెట్లో బిల్లింగ్ కౌంటర్ వద్ద విధుల్లో ఉన్న అతడిపై ముసుగేసుకొని వచ్చిన ఓ దుండగుడు అత్యంత సమీపం నుంచి కాల్పులు జరిపాడు.
శుక్రవారం ఫోైర్డెస్ అనే చిన్న పట్టణంలోని మ్యాడ్ బట్చర్ గ్రాసరీ స్టోర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. జీవనోపాధి కోసం 8 నెలల క్రితం అమెరికాకు వెళ్లిన అతడికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు. సమాచారం తెలియగానే కుటుంబ సభ్యులు షాక్కు గురయ్యారు. దుండగుడు కిరాణా దుకాణం లోపల, పార్కింగ్ వద్ద విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డాడు. నలుగురు వ్యక్తుల ప్రాణాల్ని బలిగొన్నాడు. కాల్పుల్లో మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇవీ సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యింది.