Yashoda Lodhi : మనసుకు నచ్చింది చేసుకుంటూ పోవడమే నిజమైన సక్సెస్. ఈ క్రమంలో ఎలాంటి విమర్శలు వచ్చినా పట్టించుకోనవసరం లేదు. మనం చేసే పనే మనకు ఏదో ఒక రోజు తగిన గుర్తింపు తీసుకొస్తుంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక మహిళ ఇందుకు తాజా ఉదాహరణ. ఆన్లైన్లో, ఇంగ్లీష్ పాఠాలు చెబుతున్న ఒక మహిళను ఆమె భర్తే కించపరిచాడు. కానీ, ఇప్పుడు ఆమెను ఏకంగా గ్లోబల్ నటి ప్రియాంకా చోప్రా జోనాస్ ప్రశంసించారు. ఆమె వీడియోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు.
దీంతో ఆమె పనికి మరింత ప్రశంసలు లభిస్తున్నాయి. ప్రియాంకా చోప్రాతో ప్రశంసలు అందుకున్న ఆ మహిళ పేరు యశోదా లోధి. ఉత్తర ప్రదేశ్‌లోని ఒక చిన్న పల్లెటూరు. పన్నెండో తరగతి వరకే చదువుకుంది. పెళ్లైన ఆమె.. భర్తతో కలిసి వ్యవసాయం చేస్తుంటుంది. పొలంలో పని చేస్తూ కూడా సోషల్ మీడియా, యూట్యూబ్‌లో వీడియోలు పోస్ట్ చేస్తుంటుంది. అది కూడా ఇంగ్లీష్ వీడియోలు. ఆమె చదివింది 12వ తరగతే అయినా ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడగలదు. దీంతో ఇన్‌స్టాగ్రామ్‌తోపాటు యూట్యూబ్‌లోనూ ఇంగ్లీష్ పాఠాలు చెబుతుంది. ఇంగ్లీష్ విత్ దేహతి మేడం పేరుతో చానెల్ నిర్వహిస్తుంది.
Priyanka Chopra shared this video on her story, and Mrunal Thakur commented on it.
Women have so much potential, but marriage often holds them back. https://t.co/cWhkpIAKhD
— Natasha ♡ (@natashaxtwts) October 7, 2026
ఇటీవల ఆమె ఇంగ్లీష్ మాట్లాడుతూ వీడియో తీస్తుంటే ఆమె భర్త ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయినప్పటికీ ఆమె వీడియోలు చేయడం ఆపలేదు. ఆమె ఇంగ్లీష్ పాఠాలను లక్షలాది మంది యూజర్లు ఫాలో అవుతున్నారు. యశోదా లోధి నిర్వహిస్తున్న ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానెల్‌కు 4,00,000కుపైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా 5,77,000కుపైగా ఫాలోవర్లు ఉన్నారు. చాలా సాధారణ మహిళగానే ఆమె వీడియోలు చేస్తూ వస్తోంది. ఇంగ్లీష్ పాఠాలు చెబుతోంది. తనను చాలా సామాన్యులే ఫాలో అవుతున్నారు అనుకుంది. ఎందుకంటే ఆమె ఇంట్లో టీవీ కూడా లేదు.
అలాంటిది, గ్లోబల్ నటి అయిన ప్రియాంకా చోప్రా ఆమె వీడియోలను షేర్ చేసిందంటే ఆమె పాపులారిటీ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అంతకుమించి.. ఆమె ప్రతిభ, ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే గ్రామీణ ప్రాంతం నుంచి ఆంగ్లం నేర్పించడం.. వాటికి గ్లోబల్ నటి ప్రచారం చేయడం నిజంగా గొప్ప విజయమే. నిజానికి ప్రియాంకా చోప్రా తన వీడియోలు షేర్ చేసిన విషయం కూడా ఆమెకు తెలియదు. ఎందుకంటే అటు వ్యవసాయం.. ఇటు కంటెంట్‌తో ఆమె బిజీగా ఉంటుంది. తన స్టూడెంట్సే యశోదకు ఈ విషయం చెప్పారు. దీంతో సంతోషం వ్యక్తం చేస్తూ యశోద మరో వీడియో రిలీజ్ చేసింది. ప్రియాంకా చోప్రాకు ధన్యవాదాలు తెలిపింది.