UPI | న్యూఢిల్లీ, మార్చి 21 : క్రియారహిత మొబైల్ ఫోన్ నంబర్లపై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) కీలక ఆదేశాలు జారీచేసింది. ఇతరులకు కేటాయించిన, ఇన్యాక్టివ్ మొబైల్ నంబర్లకు ఏప్రిల్ 1 నుంచి యూపీఐ సేవలు నిలిపివేయాలని ఆదేశించింది. అనధికార వాడకాన్ని, మోసాలను అరికట్టేందుకు ఈ మేరకు పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు, బ్యాంకులకు ఎన్పీసీఐ ఈ ఉత్తర్వులిచ్చింది. యూపీఐ వినియోగంలో మొబైల్ నంబర్ కీలకం. దీనికి వచ్చే ఓటీపీ వెరిఫికేషన్ కీలక పాత్ర పోషిస్తుంది. దీర్ఘకాలం పాటు వినియోగంలో లేని మొబైల్ నంబర్లను టెలికం కంపెనీలు వేరే వినియోగదారునికి కేటాయిస్తాయి. దీంతో యూపీఐ ఖాతాలు కూడా వారి చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉండటంతో వీటిని నివారించేందుకు ఎన్పీసీఐ ఈ చర్యలు చేపడుతున్నది.